పేగు బంధం... కన్నతల్లి కోసం భారత్ లో స్పెయిన్ యువతి సెర్చ్!

దీంతో.. భువనేశ్వర్ లోని నయాపల్లిలో అద్దెకు ఉంటూ, కుటుంబాన్ని పోషించడం ఆమెకు మోయలేని భారంగా మారింది.

Update: 2025-01-06 07:30 GMT

సుమారు 20 ఏళ్ల క్రితం నాటి సంగతి... ఒడిశాకు చెందిన బనాలత దాస్ అనే మహిళకు నలుగురు పిల్లలు. ఆమె భర్త ప్రైవేటు సంస్థలో వంట మనిషిగా పనిచేసేవాడు. అయితే కొంతకాలం తర్వాత భార్య, నలుగురు పిల్లలను వదిలేశాడు. దీంతో.. భువనేశ్వర్ లోని నయాపల్లిలో అద్దెకు ఉంటూ, కుటుంబాన్ని పోషించడం ఆమెకు మోయలేని భారంగా మారింది.

దీంతో... స్నేహ, సోము అనే ఇద్దరు పిల్లలను ఇంట్లోనే వదిలేసి.. మిగిలిన ఇద్దరూ పిల్లలను వెంటబెట్టుకుని వెళ్లిపోయింది. అప్పుడు ఇంట్లో వదిలేసిన స్నేహ వయసు సుమారు ఏడాదిన్నర కాగా.. సోము నెలల పసిబిడ్డ. ఇలా తల్లి వదిలేసి వెళ్లిపోయిన విషయం గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. ఆ పిల్లలను స్థానిక అనాథాశ్రమంలో చేర్పించారు.

ఈ క్రమంలోనే స్పెయిన్ కు చెందిన గెమా వైదల్ – జువాన్ జోష్ దంపతులు.. స్నేహ, సోమును 2010లో దత్తత తీసుకున్నారు. అప్పటికి స్నేహ వయసు ఐదేళ్లు కాగా.. సోము వయసు సుమారు 4 ఏళ్లు. అనంతరం వారిని స్పెయిన్ కు తీసుకెళ్లి సొంతబిడ్డల్లాగా పెంచుకున్నారు గైమా దంపతులు. వారిరువురిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఇప్పుడు స్నేహ వయసు 21 ఏళ్లు.

ఈ నేపథ్యంలో ఇటీవల స్నేహకు తమ మూలాలు భారతదేశంలోని ఒడిశాలో ఉన్నాయనే విషయాన్ని గెమా వైదల్ దంపతులు చెప్పారంట. దీంతో.. తనకు జన్మనిచ్చిన తల్లితండ్రులు ఎవరో తెలుసుకోవాలని స్నేహ భావించారు. అనుకున్నదే తడువుగా ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా.. గత ఏడాది డిసెంబర్ 19న భువనేశ్వర్ కు వచ్చింది.

అక్కడ స్థానిక హోటల్ లో బస చేస్తూ.. తమ చిన్ననాటి ఇంటి యజమాని దగ్గరకు వెళ్లింది. ఫలితంగా.. తన తల్లితండ్రుల పేర్లు మాత్రం తెలుసుకోగలిగింది. ఈ సమయంలో పోలీసుల సహకారంతో.. అనాథాశ్రమంలో ఉన్న వివరాలతో వాటిని ధృవీకరించుకుంది. ఈ క్రమంలో సుమారు 3 వారాలుగా తీవ్రస్థాయిలో తన తల్లితండ్రుల కోసం వెతుకులాట ప్రారంభించింది.

అయినప్పటికీ తన తల్లి (లత) ఆచూకీ లభించలేదు. ఈ సమయంలో స్థానిక పోలీస్ కమీషనర్ ని కలిసింది.. ఆయన ఆమెకు సహాయంగా ఇద్దరు పోలీసు అధికారులను అప్పగించారు. ఈ క్రమంలో తన తల్లి లత.. కటక్ లో ఉన్నట్లు గుర్తించారని చెబుతున్నారు. దీంతో... స్నేహ ఆనందానికి అవదులు లేవని చెబుతున్నారు.

అయితే... ఈ రోజు (జనవరి 6) స్నేహ తిరిగి స్పెయిన్ కు వెళ్లాల్సి ఉండటంతో.. ప్రస్తుతం "తల్లి - కూతురు" కలిసే అవకాశం తక్కువని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన స్నేహ.. అయినప్పటికీ తన ప్రయత్నాలను విరమించుకోనని.. మార్చిలో మళ్లీ తిరిగి వస్తామని చెబుతుంది. దీంతో... వీరు ఎప్పుడు కలుసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News