హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించొద్దు: ఎన్నికల వేళ చంద్రబాబుకు సుప్రీం ఆదేశం
ఈ క్రమం లో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆయనఆశ్రయించారు.
ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టు నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల వేళ ఎలాంటి ఆరోపణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గతంలో ఈమేరకు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించి తీరాలని పేర్కొంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు గత ఏడాది చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 53 రోజుల పాటు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూడా పెట్టారు. ఈ క్రమం లో తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆయనఆశ్రయించారు.
దీనిపై సుదీర్ఘ విచారణలు, వాదనల అనంతరం.. హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే.. ఈ సమయంలో కొన్ని షరతులు విదించింది. కేసు గురించి, విచారణ గురించి ఎక్కడా మాట్లాడరాదని పేర్కొంది. అంతేకాదు.. ఆరోపణలు, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని కూడా ఆదేశించింది. ఈ షరతులకు లోబడి బెయిల్ ఇచ్చింది. అయితే.. ఈ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ.. ఏపీ సీఐడీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో చంద్రబాబు కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. రెడ్‌బుక్ పేరుతో అధికారులను హెచ్చరిస్తున్నారని, బెదిరింపులకు గురి చేస్తున్నారని.. పేర్కొన్నారు. అంతేకాదు.. గతంలో తమ వాదనలను ఏపీ హైకోర్టు పట్టించుకోలేదని పేర్కొన్నారు.
దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. గతంలో హైకోర్టు ఇచ్చిన షరతు ఆదేశాలను ఉల్లంఘించరాదని పేర్కొంది. అంతేకాదు.. స్కిల్ కేసు విచారణ ముగిసే వరకు ఎలాంటి ఆరోపణలు చేయరాదని పేర్కొంది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ ఆదేశాలను ఉల్లంఘించరాదని తెలిపింది. కేసు విచారణను మే 7వ తేదీకి వాయిదా వేసింది. కాగా, మే 13 న రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి.
సీఐడీ ఆరోపణలు ఇవీ..
+ రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
+ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు అధికారుల పైన చర్యలు తీసుకుంటామన్నారు.
+ దీనివల్ల అధికారుల పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది
+ ఇలా చేయడం కోర్టు ఇచ్చిన షరుతుల ఉల్లంఘన కిందకే వస్తుంది.
+ఈ నేపథ్యంలో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలి