ప్రకటనలకున్న పైసలు అభివృద్ధికి లేవా... సుప్రీంకోర్టు సీరియస్!
జాతీయ ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు చేయకుండా ఇతర అంశాలకు డబ్బులు మళ్లిస్తే ఎలాంటి ప్రయోజమని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆప్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీ-మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (ఆర్.ఆర్.టీ.ఎస్.) ప్రాజెక్టు కోసం నిధులు విడుదల చేయకపోవడంపై ఢిల్లీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జాతీయ ప్రాజెక్టులకు డబ్బులు ఖర్చు చేయకుండా ఇతర అంశాలకు డబ్బులు మళ్లిస్తే ఎలాంటి ప్రయోజమని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆప్ సర్కార్ పై కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... ర్యాపిడ్ రైలు ప్రాజెక్టుకు తన వాటా కింద ఇవ్వాల్సిన నిధులను అందించకపోవడంతో కేజ్రీవాల్ ప్రభుత్వపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీ ప్రభుత్వ ప్రకటనల బడ్జెట్ 3 సంవత్సరాలకు 1,100 కోట్ల రూపాయలు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ముఖ్యమైన పనికి డబ్బు ఎందుకు లేదని ప్రశ్నించింది. ప్రకటనల కోసం వెచ్చించిన డబ్బును మౌళిక సదుపాయాల కల్పన కోసం మళ్లించాలని తాము అడిగేందుకు వెనుకాడబోమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
వాస్తవానికి, ర్యాపిడ్ రైలు ప్రాజెక్ట్ ద్వారా ఢిల్లీని యూపీలోని మీరట్ తో అనుసంధానం చేస్తుంది. అందుకే దీన్నీ ఢిల్లీ -మీరట్ ప్రాంతీయ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం అని అంటారు. అందువల్ల ఈ ప్రాజెక్టుకు అయ్యే వ్యయం ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చెల్లించాలి. ఈ విషయంలో ఆప్ సర్కార్ నిధులు విడుదల చేయకపోయేసరికి రాష్ట్ర ప్రభుత్వంపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది.
ఇందులో భాగంగా... మీవంతు చెల్లిస్తామని ముందు ఒప్పుకున్నారని ఆప్ సర్కార్ కి గుర్తుచేసిన సుప్రీంకోర్టు... అది అనుకున్నట్లుగా మీరు చెల్లించకపోతే, మీ ప్రకటనల బడ్జెట్ ను జప్తు చేస్తామని తెలిపింది. అనంతరం.. వాటిని ఇప్పుడే జప్తు చేయమని ఆదేశిస్తున్నామని అంటూనే.. ఈ ఆదేశాన్ని ఒక వారం వాయిదా వేస్తున్నామని తెలిపింది. అప్పటి వరకు చర్యలు తీసుకోకుంటే ఉత్తర్వులు అమలు చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కాగా... ఆర్.ఆర్.టీ.సీ ప్రాజెక్టును గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఢిల్లీ - యూపీలోని మీరట్ ను అనుసందానం చేసే ఈ ప్రాజెక్టుకు మూడేళ్ల బడ్జెట్ రూ.1,100 కోట్లు. అయితే ఈ ఏడాది రూ.550 కోట్లు ఢిల్లీ సర్కార్ చెల్లించాల్సి ఉంది. ఈ విషయంలో ఆప్ సర్కార్ నిర్లక్ష్యం వహించండంపై సుప్రీం సీరియస్ అవుతూ.. ఒక వారం రోజులు గడువిచ్చింది!