ఎంపీలు, ఎమ్మెల్యేల శరీరంలో చిప్ పెట్టాలా?: సుప్రీంకోర్టు హాట్ కామెంట్స్!
ఎంపీ, ఎమ్మెల్యేలను 24 గంటలూ పర్యవేక్షించమంటారా..? ఇలాంటివి చట్టం నుంచి తప్పించుకొనే వారి విషయంలోనే చేస్తారని స్పష్టం చేసింది.
సుపరిపాలన అందించడంలో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేలను అన్ని వేళల్లో పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) విచారించిన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేలు అయినా, ఎంపీలు అయినా వారు ప్రజల్లో భాగమేనని.. వారికి కూడా గోప్యతా హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. వారి కదలికలను 24 గంటలూ తెలుసుకునేందుకు వారి శరీరాల్లో చిప్ లు పెట్టాలా అని నిలదీసింది. మీరు ఏం కోరుకుంటున్నారో అర్థమవుతోందా అని పిటిషనర్ ను ప్రశ్నించింది.
ఎంపీ, ఎమ్మెల్యేలను 24 గంటలూ పర్యవేక్షించమంటారా..? ఇలాంటివి చట్టం నుంచి తప్పించుకొనే వారి విషయంలోనే చేస్తారని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరికీ గోప్యతా హక్కు ఉంటుందని వెల్లడించింది. ఎంపీలను పర్యవేక్షించేందుకు వారి శరీరాల్లో చిప్ లు పెట్టలేమని తెలిపింది. ఇలాంటి సమయాన్ని హరించే, ప్రజాప్రయోజనం లేని పిటిషన్లు దాఖలు చేసినందుకు రూ.5 లక్షలు జరిమానా కింద వసూలు చేస్తామని పిటిషనర్ ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ మేరకు పిటిషనర్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
సుపరిపాలన ప్రజలకు అందాలంటే ఎంపీలు, ఎమ్మెల్యేలను అనుక్షణం పర్యవేక్షించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన సురీందర్ నాథ్ కుంద్రా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజా సేవకులని, కానీ, వాళ్లు పాలకుల మాదిరిగా ప్రవర్తిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. ధర్మాసనం స్పందిస్తూ ఎంపీలందరిపై ఇలా ఒకే అభియోగం మోపలేరని స్పష్టం చేసింది. ఇలాంటి అంశాలతో రావడం కోర్టు సమయాన్ని వృథా చేయడమేనని పిటిషనర్ ను మందలించింది. పిల్ ను కొట్టేసింది.