నీటిపై తేలుతున్న నిఘా విమానం... వీడియో వైరల్!

దీంతో ఆ విమానంలోని తొమ్మిది మంది వ్యక్తులు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని అధికారులు తెలిపారు.

Update: 2023-11-21 09:05 GMT

అగ్రరాజ్యం అమెరికా నౌకాదళానికి చెందిన ఓ భారీ నిఘా విమానం సముద్రంలోకి దూసుకెళ్లింది. రన్‌ వేపై అదుపు తప్పడంవల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని హవాయిలోని మెరైన్‌ కోర్‌ బేస్‌ ప్రతినిధి ఓర్లాండో ప్రెజ్‌ వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే కోస్టు గార్డు సిబ్బంది స్పందించారు. దీంతో ఆ విమానంలోని తొమ్మిది మంది వ్యక్తులు ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారని అధికారులు తెలిపారు.

అవును... సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అమెరికాలోని హవాయిలోని మెరైన్‌ కోర్‌ బేస్‌ లో ఒక భారీ నిఘా విమానం అదుపుతప్పి ఏకంగా సముద్రంలోకి దూసుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ గా మారింది. ఇలా విమానం నీటిపై తేలడం చూసి... అక్కడే సముద్రంలో బోటింగ్‌ చేస్తున్నవారు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

అయితే ఈ ఘటనకు గల కారణల్లో విజబిలిటీ ప్రధానమైందని ప్రాథమికంగా ఒక క్లారిటీకి వస్తున్నారంట అధికారులు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విజిబిలిటీ తక్కువగా ఉందని అంటున్న్నారు. ఆ సమయంలో అక్కడ గంటకు 21 మైళ్ల వేగంతో గాలులు, పొగమంచు కురుస్తుందని చెబుతున్నారు. ఇక.. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయనే విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదు.

కాగా... అమెరికా నౌకాదళంలో పీ-8ఏ పొసెడాన్‌ విమానం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందనేది తెలిసిన విషయమే. ఇది సముద్రపు నీటిలోపల ఉన్న సబ్‌ మెరైన్లను గాలించి వాటిపై నేరుగా దాడి చేయగలదు. ఇదే సమయంలో భారీగా ఇంటెలిజెన్స్‌ ను కూడా ఈ విమానం సేకరించగలదు. టోర్పెడోలు, క్రూజ్‌ క్షిపణులను ఇది తీసుకెళ్లగలదు.

ఇక ప్రపంచంలో పీ8 విమానాలను అమెరికాతోపాటు ఇండియా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, నార్వే, న్యూజిలాండ్‌ సైన్యాలు వాడుతున్నాయి.

Tags:    

Similar News