జయ చీర లాగటం అబద్ధమట.. స్టాలిన్ కొత్త వాదన

Update: 2023-08-13 06:18 GMT

అప్పుడెప్పుడో జరిగిపోయిన ఉదంతాన్ని.. టైమ్లీగా తెర మీదకు తీసుకొచ్చి.. విపక్షంపై విరుచుకుపడిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాటకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఉలికిపాటు ఇప్పుడు విచిత్రంగా మారింది. లోకం మొత్తం కోడై కూసి.. తమిళనాడు రాజకీయ చరిత్రలో అత్యంత దారుణ ఘటనగా పలువురు అభివర్ణించే ఉదంతం మొత్తం తప్పని.. అదంతా అబద్ధంగా చెబుతున్న స్టాలిన్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. మణిపూర్ ఉదంతంపై డీఎంకే ఎంపీ.. స్టాలిన్ సోదరి కనిమొళి లోక్ సభలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోడీ తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు.

ఈ క్రమంలో తమిళనాడు అసెంబ్లీలో దివంగత ముఖ్యమంత్రి జయలలిత చీరను లాగిన పార్టీ అంటూ కనిమొళి ప్రాతినిధ్యం వహించే డీఎంకే తీరును టైమ్లీగా ప్రస్తావిస్తూ పంచ్ లు వేశారు. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే నేతలు చీర లాగటం అప్పట్లో పెను సంచలనంగా మారటమే కాదు.. అదో మాయని మచ్చలా నిలిచింది. అప్పుడే కాదు ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఈ అంశం చర్చకు వచ్చింది. అంతదాకా ఎందుకు జయలలిత మరణం తర్వాత వచ్చిన ఆమె బయోపిక్ లోనూ ఈ ఉదంతాన్ని ప్రముఖంగా ప్రస్తావించటం తెలిసిందే.

గతంలో ఎప్పుడూ ఖండించని ఈ అంశాన్ని తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి.. డీఎంకే అధినేత స్టాలిన్ తీవ్రంగా తప్పు పడుతున్నారు. తమ అసెంబ్లీలో జరగని సంఘటనను జరిగినట్లుగా పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాధ్యతరహితంగా అవాస్తవమైన వ్యాఖ్యలు చేయటం గర్హనీయమని ఆయన మండిపడ్డారు. ఒక మీడియా సంస్థతో తాజాగా మాట్లాడిన స్టాలిన్.. జయ చీర లాగిన ఉదంతంపై సరికొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చి అవాక్కు అయ్యేలా చేశారు.

1989లో అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి జయలలిత చీర లాగారంటూ డీఎంకేను ఉద్దేశించి కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నస్టాలిన్.. అసెంబ్లీలో జయ చీర లాగటం అబద్ధమని.. ఆమె అసెంబ్లీకి రావటానికి ముందే పోయెస్ గార్డెన్ లో (జయలలిత నివాసం) రిహార్సల్ చేసి అసెంబ్లీలో నాటకమాడారన్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో ఇటీవల వస్తున్న తప్పుడు వార్తల్ని చూసి కేంద్రమంత్రి మాట్లాడుతున్నారనే అనుమానం తనకు కలుగుతుందన్న వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తనకు పరాభవం జరిగినట్లుగా జయలలిత నాటకం ఆడిన విషయం అప్పటి అసెంబ్లీ సభ్యులందరికి తెలుసన్న ఆయన.. మాజీ మంత్రి.. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న తిరునావుక్కరసనర్ అసెంబ్లీలో ఉన్నారన్నారు.

జయలలితకు అసెంబ్లీలో ఎలాంటి అవమానాలు జరగలేదంటూ ప్రసంగించిన వివరాలు సభలో రికార్డు అయినట్లుగా చెప్పుకొచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే.. కేంద్ర మంత్రి మాత్రం తమిళనాడు అసెంబ్లీలో జరిగినట్లుగా చెబుతున్న అంశాలు వక్రీకరించిన చెప్పినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. స్టాలిన్ తాజా వ్యాఖ్యలు షాకింగ్ గా మారాయి. ఇంతకాలం తమిళనాడు అసెంబ్లీలో జరిగినట్లుగా ప్రచారమైన అంశాలు తప్పని.. వాటిల్లో నిజం లేదన్న విషయాన్ని ఇప్పుడు ఇంత బలంగా చెప్పిన వేళ.. అమ్మ బయోపిక్ లో అంత స్పష్టంగా చూపిస్తూ.. లోకమంతా దీని గురించి మాట్లాడుకున్న వేళ.. ఒక చిన్నపాటి ఖండన కూడా డీఎంకే నుంచి ఎందుకు రాలేదన్న ప్రశ్నను సంధిస్తున్నారు. ఏమైనా స్టాలిన్ మాటలతో ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసినట్లైందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News