పాజిటివ్ వేవ్ లేని బీజేపీ టీడీపీని గెలిపిస్తుందా ?

ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ జనసేన కలసి ఉన్నపుడు వచ్చిన రియాక్షన్ బీజేపీతో చేరిన తరువాత రాలేదన్న భావన కూడా ఉంది.

Update: 2024-05-11 02:30 GMT

దేశంలో బీజేపీకి సానుకూల పవనాలు వీచడం లేదని వామపక్ష నేతలు అంటున్నారు. బీజేపీ బలం తగ్గిపోతోంది కాబట్టే నరేంద్ర మోడీ అమిత్ షా వంటి వారు ముస్లిం మైనారిటీ వర్గాల విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు అని విజయవాడలో తాజాగా జరిగిన ఒక సమావేశంలో సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి విమర్శించారు.

ఏపీలో టీడీపీ ఎన్డీయే కూటమిలో చేరడం పొరపాటు అని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ మోడీ గ్లామర్ తమకు ఉపయోగపడుతుందని భావిస్తే కనుక అది తప్పు అవుతుందని అన్నారు. ఇదిలా ఉంటే ఏపీలో టీడీపీ జనసేన కలసి ఉన్నపుడు వచ్చిన రియాక్షన్ బీజేపీతో చేరిన తరువాత రాలేదన్న భావన కూడా ఉంది.

దానికి సీతారాం ఏచూరి కామెంట్స్ బలం చేకూరేలా చేస్తున్నాయని అంటున్నారు. ఏపీలో ముస్లిం రిజర్వేషన్ల రద్దు మీద బీజేపీ పెద్దలు మాట్లాడకపోయినా దేశమంతా ప్రస్తుతం అదే ప్రచారం చేస్తున్నారు. దాంతో అది అంతిమంగా టీడీపీ కూటమిని చేటు చేస్తుందని వామపక్ష నాయకులు చెబుతున్నారు.

ఒక వర్గంలో అభద్రతాభావం రగిలించి దాని మీద రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ చూస్తోందని, అయితే అది సాధ్యపడకపోగా బూమరాంగ్ అవుతుందని అంటున్నారు. ఇక టీడీపీ కూడా బీజేపీతో కలసి ఉన్నందుకు ఈ ఇబ్బంది ఆ పార్టీకి తప్పదని కామ్రేడ్స్ అంటున్నారు.

ఏపీలో రాజకీయాలను కేవలం జగన్ వర్సెస్ చంద్రబాబు అన్న కోణంలో మాత్రమే చూడరాదని, జాతీయ కోణం నుంచి కూడా చూడాలని ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచిస్తారని వామపక్ష నేతలతో పాటు అభ్యుదయ వాదులు, మేధావులు ప్రజా సంఘాల నేతలు అంటున్నారు.

జాతీయ రాజకీయాల్లో ఈ రోజు బీజేపీ గమనం ప్రభావం మెల్లగా తగ్గుతూ వస్తోందని ఆ నేపధ్యం నుంచి చూసినపుడు 2014 2024 ఎలా అవుతుందో టీడీపీ సహా పొత్తు పార్టీలే చెప్పాలని అంటున్నారు. 2014లో బీజేపీ మోడీకి ఉన్న సానుకూలత వేరు అని ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితి వేరు అని అంటున్నారు. రెండు సార్లు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ చాలా హామీలను నెరవేర్చలేదని పైగా దేశంలో తనదైన సొంత అజెండాతో రాజకీయాలు చేస్తూ వస్తోందని విశ్లేషిస్తున్న నేపధ్యం ఉంది.

దాంతో ఏపీలో కూటమికి బీజేపీ పొత్తు వల్ల రాజకీయ లాభం ఈసారి ఎన్నికల్లో కనిపించదనే అంటున్నారు. రిపీట్ 2014 అన్న దానికి అర్ధం కూడా లేదని రాజకీయాల్లో నిన్నటి పరిస్థితి నేడు ఉండదని అలాంటిది పదేళ్ళ నాటి ఫలితాలు ఎలా వస్తాయని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే ఈసారి ఏపీ ప్రజలు జాతీయ అంశాలతో పాటు దేశంలో జరుగుతున్న కార్యక్రమాలు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే పనితీరు అలాగే దేశంలోని విపక్షాల తీరు అన్నీ ఆలోచించుకునే సమగ్రమైన తీర్పు ఇస్తారని అంటున్నారు. మొత్తం మీద చూస్తే బీజేపీ మోడీ అయితే ఏపీలో టీడీపీని గెలిపించలేరని సీతారాం ఏచూరి లాంటి వారు స్పష్టమైన విశ్లేషణ చేస్తున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News