మరి.. ఎలాన్‌ మస్క్‌ ఏపీకి వస్తారా?

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని ప్రచారం చేసుకుంది.

Update: 2024-06-17 11:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురాలేకపోయిందని, ఉన్న కంపెనీలను కూడా వెళ్లగొట్టిందని, కొత్త కంపెనీలను తీసుకురాలేకపోయిందనే అపప్రథ ఉంది. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణాల్లో ఈ అంశం ఒకటిగా నిలిచిందని అంటున్నారు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గత ఐదేళ్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చామని ప్రచారం చేసుకుంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని తిప్పికొట్టాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ విధానాలతో అమర్‌ రాజా, లులూ, జాకీ వంటి ప్రముఖ సంస్థలు రాష్ట్రాన్ని వదిలి తమ పెట్టుబడులను పక్క రాష్ట్రాలకు తరలించేశాయనే విమర్శలున్నాయి.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేనిఫెస్టోలో టీడీపీ, జనసేన పార్టీలు హామీ ఇచ్చాయి. దీంతో ప్రభుత్వంపై ఈ హామీని నిలుపుకోవాల్సిన బాధ్యత పడింది. కొత్త కంపెనీలు, పెట్టుబడులు వస్తేనే ప్రభుత్వ హామీ సాధ్యమవుతుంది.

దీంతో కొత్త ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడం, కొత్త కంపెనీల ఏర్పాటుపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఏపీ పరిశ్రమలు, వాణì జ్య శాఖ మంత్రిగా నియమితులైన టీజీ భరత్‌ తన పనిని మొదలుపెట్టేశారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, స్పేస్‌ ఎక్స్, టెస్లా, ఎక్స్‌ సంస్థల అధిపతి అయిన ఎలాన్‌ మస్క్‌ కు ఆహ్వానం పంపారు. ఏపీకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా టీజీ భరత్‌.. ఎలాన్‌ మస్క్‌ కు ఆహ్వానం పంపారు.

వాస్తవానికి ఎలాన్‌ మస్క్‌ ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శించాల్సి ఉంది. టెస్లా ఈ–కార్లకు సంబంధించిన అంశాలను చర్చించడానికి ఆయన దేశానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలోనూ పర్యటించాలని, ఏపీలో ఉన్న అవకాశాల గురించి తెలుసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌.. ఎలాన్‌ మస్క్‌ ను కోరారు.

‘‘సార్‌ నేను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖల మంత్రిని. మీరు భారతదేశాన్ని సందర్శించాలనుకుంటున్నారని, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలను పరిశీలిస్తున్నారని తెలుసుకున్నాను. మీరు డైనమిక్, దూరదృష్టి గల నాయకుడిగా.. మీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్‌ ను కూడా పరిశీలించాలని కోరుతున్నాను. చంద్రబాబు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. మీరు విన్న లేదా చూసిన హైదరాబాద్‌ ఆయన విజన్, నాయకత్వానికి నిదర్శనం.

మీ భారత పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ని సందర్శించాలని మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మా ముఖ్యమంత్రి మీ పెట్టుబడులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను అందజేస్తారు. మీ వ్యాపారానికి ఆంధ్రప్రదేశ్‌ ఆకర్షణీయమైన గమ్యస్థానమని మీరు తెలుసుకుంటారనే నమ్మకం నాకు ఉంది. దయచేసి మీ ప్రయాణ ప్రణాళికలో మా రాష్ట్రాన్ని చేర్చవలసిందిగా అభ్యర్థిస్తున్నాం’ అని టీజీ భరత్‌ ఎక్స్‌ లో కోరారు. ఈ మేరకు ఈ పోస్టును టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్, టెస్లా, టెస్లా ఏషియా, టీడీపీ, చంద్రబాబు, ఏపీసీఎంవో ఖాతాలకు ట్యాగ్‌ చేశారు.

ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి పెట్టుబడిదారులు, ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలు తమ సంస్థలను ఏపీలో ఏర్పాటు చేస్తే కూటమి ప్రభుత్వానికి ఈ అంశం గేమ్‌ చేంజర్‌ అవుతుందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినట్టు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల కూడా సాకారమవుతుందని చెబుతున్నారు

Tags:    

Similar News