పవన్ కి సీఎం పదవిని చంద్రబాబు ఇస్తారా...?

ఆ మధ్యన మంగళగిరి పార్టీ ఆఫీసులో కూడా పవన్ సీఎం పదవి విషయం ఎన్నికల తరువాత రెండు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు

Update: 2023-12-08 03:54 GMT

చంద్రబాబు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. అపర చాణక్యుడు అని అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో ఏ మాత్రం అవగాహన ఉన్న వారికైనా చంద్రబాబు అధికారం మరొకరితో అసలు షేర్ చేసుకోరు అనే చెబుతారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం చాలా చిత్రంగా మాట్లాడుతున్నారు. ఆయన జనసైనికులకు టీడీపీతో పొత్తు వల్ల కలిగే లాభాలను వివరించాలనో లేక ఏపీలో సీఎం అయ్యే చాన్స్ జనసేనకు ఇంకా ఉందని చెప్పడానికో చంద్రబాబు ప్రస్తావన పదే పదే తెస్తున్నారు.

ఆ మధ్యన మంగళగిరి పార్టీ ఆఫీసులో కూడా పవన్ సీఎం పదవి విషయం ఎన్నికల తరువాత రెండు పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు. ఇపుడు విశాఖ సభలో పవన్ మాట్లాడుతూ సీఎం పదవి గురించి తానూ చంద్రబాబు మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు.

సీఎం అని అభిమానులు నినదిస్తూంటే పవన్ ఈ ప్రకటన చేస్తూ సీఎం సంగతి తాము నిర్ణయిస్తామని ముందు పొత్తు పార్టీలను భారీ మెజారిటీతో గెలిపించడానికి కృషి చేయాలని కోరడం విశేషం. నిజంగా మాట్లాడుకున్నా జనసేనతో సీఎం పదవిని షేర్ చేసుకోవడానికి టీడీపీ ముందుకు వస్తుందా అన్నది చర్చగా ఉంది.

ఎందుకంటే మొత్తం 175 సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 88 ఎవరికి వస్తే వారే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. టీడీపీ జనసేనతో పొత్తులో ఉన్నా కచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ కి సరిపడా సీట్ల కోసమే ఫైట్ చేస్తుంది. అందుకు సరిపడే విధంగానే పోటీ చేస్తుంది. జనసేనకు పాతిక నుంచి ముప్పయి సీట్లు ఇచ్చిన మిగిలిన 145 సీట్లలో టీడీపీ పోటీ చేయడం ఖాయం.

అందులో కనీసంగా 90 సీట్లు గెలిచినా సొంతంగా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. అపుడు 2014 మాదిరిగా మిత్రపక్షం అని జనసేనకు ఒకటి రెండు మంత్రి పదవులు ఇస్తారు. అంతే కానీ సీఎం పదవిని షేర్ చేసుకుంటారా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే కర్నాటకలో జరిగినట్లుగా కుమారస్వామి మాదిరిగా సీఎం కావాలంటే హంగ్ అసెంబ్లీ రావాలి.

అలాంటి పరిస్థితి రావాలంటే జనసేన పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకుని పోటీ చేయాలి. కానీ జనసేనకు అన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించదు అని కూడా ప్రచారంలో ఉంది. మొత్తానికి చూస్తే సీఎం సీటు విషయం ఎన్నికల తరువాత మాట్లాడుకుంటామని పవన్ చెబుతున్నారు అంటే అది జనసైనికులు అంత అమాయకంగా నమ్మేస్తారా అన్నదే చర్చగా ఉంది.

Tags:    

Similar News