టీడీపీ, జనసేన కొత్త లోగో ఇదే!
టీడీపీ గుర్తు అయిన సైకిల్, జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ లతోపాటు రెండు పార్టీలను కలుపుతున్నట్టు పసుపు, ఎరుపు రిబ్బన్ల మాదిరిగా ఒక లోగోను ఏర్పాటు చేశారు.
తెలుగుదేశం, జనసేన పార్టీలు తమ ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను ఫిబ్రవరి 24న మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. టీడీపీ 94 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇక జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు తెలిపింది. దీంతో రెండు పార్టీలు 118 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్టయింది. మరో 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. బీజేపీతో పొత్తు ఖరారయ్యాక 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.
కాగా టీడీపీ, జనసేన మొదటి విడత అభ్యర్థుల జాబితా ప్రకటన సందర్భంగా ఇరు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పార్టీల నేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు తదితరులు వేదికపైన ఆశీనులయ్యారు.
కాగా నేతలు కూర్చున్న వేదిక వెనుక వైపు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షించింది. టీడీపీ–జనసేన పొత్తుకు సూచికగా ఉమ్మడి లోగోను అక్కడ ఏర్పాటు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ గుర్తు అయిన సైకిల్, జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ లతోపాటు రెండు పార్టీలను కలుపుతున్నట్టు పసుపు, ఎరుపు రిబ్బన్ల మాదిరిగా ఒక లోగోను ఏర్పాటు చేశారు. ఇంతకు ముందెన్నడూ ఇలాంటి లోగో కనిపించకపోవడం.. ఇప్పుడు ఈ ఉమ్మడి లోగో కనిపించడం ఆసక్తి రేపింది.
ఇప్పటివరకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పలుమార్లు సమావేశాలు జరిపినా ఎప్పుడూ ఉమ్మడి లోగో కనిపించలేదు. ఇప్పుడు సీట్ల ప్రకటన సందర్భంగా తొలిసారి ఉమ్మడి లోగో కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అది కూడా పసుపు గుర్తు టీడీపీని సూచిస్తూ, ఎరుపు గుర్తు జనసేనను సూచిస్తూ ఉండటం విశేషం.
సహజంగా కూటమిలోని పార్టీలు తమ సొంత పార్టీ గుర్తులను బ్యానర్లు, ఫెక్సీల్లో ప్రదర్శిస్తాయి. అయితే టీడీపీ, జనసేనల ఉమ్మడి లోగో రెండు పార్టీల మధ్య సత్సంబంధాలను పెంచడానికి ఏర్పాటు చేసి ఉంటారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ లోగో కూడా వైరల్ అవుతుంది. టీడీపీ, జనసేన కార్యకర్తలు ఈ లోగోను కూడా షేర్ చేస్తున్నారు.
లోగో రెండు పార్టీల ఎన్నికల గుర్తులు అయిన సైకిల్, టీ గ్లాస్, పసుపు (టీడీపీ), ఎరుపు (జనసేన)ల మధ్య పరస్పర సంబంధాన్ని సూచించేలా ఉందని అంటున్నారు. ఈ కూటమికి సంబంధించి ఈ లోగోను విస్తృతంగా ప్రచారంలో పెడతారని తెలుస్తోంది.