విశాఖ వైసీపీ షాక్ వెనుక ఉన్నదెవరు?

కార్పొరేటర్లు జారిపోతారన్న వార్తలు కొద్ది రోజులుగా వస్తున్న నేపథ్యంలో.. విపక్షపార్టీ గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

Update: 2024-07-22 04:36 GMT

కొద్దిరోజులుగా వెల్లువెత్తుతున్న సందేహాలకు చెల్లుచీటి ఇచ్చేస్తూ.. క్లారిటీగా కరెంటు షాక్ లాంటి పరిణామం విశాఖ వైసీపీకి ఎదురైంది. ఆ పార్టీకి చెందిన పన్నెండు మంది కార్పొరేటర్లు (విశాఖ నగరపాలక సంస్థకు చెందిన) పార్టీని వీడారు. అధికార తెలుగుదేశం.. జనసేనలో చేరారు. మొత్తం 12 మందిలో ఏడుగురు టీడీపీలో.. ఐదుగురు జనసేనలో చేరుతూ నిర్ణయం తీసుకున్నారు. కార్పొరేటర్లు జారిపోతారన్న వార్తలు కొద్ది రోజులుగా వస్తున్న నేపథ్యంలో.. విపక్షపార్టీ గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.

పార్టీని వీడే ఆలోచనల నేపథ్యంలో అధినాయకత్వం అప్రమత్తమైంది. మాజీ మంత్రి అమర్ నాథ్ ను రంగంలోకి దించింది. ఈ క్రమంలో సదరు కార్పొరేటర్లకు పార్టీని విడిచి పెట్టి వెళ్లొద్దంటూ ఆయన కోరారు. అయినప్పటికీ ఆయన మాటను పట్టించుకోని పన్నెండు మంది కార్పొరేటర్లు అధికార కూటమిలో భాగస్వామ్యం అవుతున్నట్లుగా పేర్కొంటూ.. కొత్త కండువాలు కప్పేసుకున్నారు.

తాజాగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో అటు తెలుగుదేశం.. ఇటు జనసేనల కార్యాలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. గతంలో జగన్ ప్రభుత్వం టీడీపీకి చెందిన పలువురి మీద రకరకాల ఒత్తిళ్లు తీసుకొచ్చి తమ పార్టీ నుంచి వారి పార్టీలోకి చేర్చుకుందని.. తిరిగి వారు సొంతింటికి వచ్చేశారని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. తాము ఎవరిని ఒత్తిళ్లు పెట్టి పార్టీలోకి తీసుకురాలేదని.. పాతవారి రాకతో కొత్త వారికి ఎలాంటి సమస్యా ఉండదని పేర్కొన్నారు. త్వరలోనే విశాఖ మేయర్ ను తొలగించే అంశంపై నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు పల్లా శ్రీనివాసరావు.

విశాఖ కార్పొరేషర్ లో మొత్తం 97 మంది ఉండగా.. అధికార తెలుగుదేశం పార్టీ కూటమి బలం 45కు చేరుకుంది. వైసీపీ బలం 50కు తగ్గిపోయింది. సీపీఐ.. సీపీఎంలు ఒక్కొక్కరుగా ఉన్నారు. దీంతో.. రానున్న రోజుల్లో మరో తడవ కార్పొరేటర్లు కూటమిలో చేరటం ఖాయమని చెబుతున్నారు. త్వరలోనే విశాఖ మేయర్ పీఠం ఖాళీ అవుతుందని.. కొత్త వారు ఎన్నిక అవుతారని చెబుతున్నారు. ఇక.. ఈ ఎపిసోడ్ మొత్తం వెనుక ఉన్నదెవరు? అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీని బలోపేతం చేయటంతో పాటు.. కూటమి ప్రతినిధే మేయర్ కానున్నట్లుగా చెప్పాలి. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఎంపీ భరత్ తో పాటు.. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అండ్ కోలు కీలకంగా వ్యవహరించినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News