బీజేపీలో ఏం జరుగుతోంది..! కీలక సమావేశానికి ఆ నేతలు ఎందుకు రాలేదు..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఒక్కసారిగా కలకలం రేపింది. పార్టీలో సీనియర్ల వ్యవహారం ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది.

Update: 2024-10-19 07:50 GMT

తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ఒక్కసారిగా కలకలం రేపింది. పార్టీలో సీనియర్ల వ్యవహారం ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది. పార్టీ వ్యవహారాలను పట్టించుకోకపోవడంపై ఇప్పుడు చర్చకు దారితీసింది. కీలక సమావేశానికి కూడా డుమ్మా కొట్టడంతో పార్టీలో ఏం జరుగుతోందా అన్న ఆందోళన కనిపిస్తోంది.

తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. తెలంగాణలో త్వరలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఈ మీటింగులో ప్రధానంగా చర్చించారు.

మరోవైపు.. జాతీయ నాయకత్వం విధించిన సభ్యత్వాల లక్ష్యంపైనా సీరియస్‌గా చర్చ జరిగింది. టార్గెట్ రీచ్ కాకపోవడంతో జాతీయ నాయకత్వం సీరియస్‌గా ఉన్నట్లు వివరించారు. అలాగే.. వచ్చే ఏడాదిలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనా దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగా రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితి.. పార్టీని మరో బలోపేతంపై చర్చించారు.

అయితే.. ఇంతటి కీలక సమావేశానికి, జాతీయ నాయకుడు హాజరైన సమావేశానికి రాష్ట్రంలోని కీలక నేతలు హాజరుకాలేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితోపాటు ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేషర్‌రెడ్డి, రఘునందన్ రావు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీశ్, పైడి రాకేశ్ రెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, పాయల్ శంకర్, రామారావు పాటిల్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు.

కాగా.. ఈ కీలక భేటీకి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గైర్హాజరు కావడం ఆందోళన కలిగించింది. సంజయ్ కరీంనగర్‌లోనే ఉన్నప్పటికీ సమావేశానికి రాకపోవడంపై పార్టీలో చర్చకు దారితీసింది. సంజయ్‌తోపాటు ఎంపీలు డీకే అరుణ, గోడెం నగేశ్, ధర్మపురి అర్వింద్ కూడా సమావేశానికి రాలేదు. ఇక ఎమ్మెల్యేల్లోనూ రాజాసింగ్ ఒక్కరు మాత్రమే హాజరుకాలేదు. గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూనే ఉన్నారు.

ఇప్పటికే పార్టీలో రాష్ట్ర నాయకత్వం, ప్రజాప్రతినిధులకు మధ్య విభేదాలు సాగుతున్నట్లు ప్రచారం ఉంది. విభేదాల వల్లే సభ్యత్వ నమోదు కూడా ఆలస్యం అవుతున్నట్లుగా చర్చ జరుగుతోంది. అయితే.. ఈ క్రమంలో నిర్వహించిన కీలక సమావేశానికి నేతలు రాకపోవడంపై అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News