ఆ పదవికి .. ఆ నలుగురు .. దక్కేది ఎవరికి ?!

తెలంగాణ విద్యా శాఖ కమీషన్ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిల పేర్లు వినిపిస్తున్నాయి.

Update: 2024-09-05 08:30 GMT

తెలంగాణ విద్యా కమీషన్ చైర్మన్ పదవి ఎవరికి దక్కబోతుంది ? ఆ పదవికి అర్హులుగా భావిస్తున్న నలుగురిలో ఎవరిని ఎంపిక చేయబోతున్నారు ? పోటీ పడుతున్న నలుగురిలో ఎవరికి వారే అనుభవం, అర్హతలు ఉన్న వారు కావడంతో చివరికి దక్కేది ఎవరికి అన్న ఉత్కంఠ నెలకొన్నది.

తెలంగాణ విద్యా శాఖ కమీషన్ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రొఫెసర్ హరగోపాల్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిల పేర్లు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో తెలంగాణ జన సమితి పార్టీ నుండి అభ్యర్థులను ఎన్నికల్లో నిలపకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికిన ప్రొఫెసర్ కోదండరాం తాజాగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.

తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించడంతో పాటు, విద్యారంగంలో అపార అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయనకు పదవి ఇస్తే బాగుంటుందని భావిస్తున్నా ఎమ్మెల్సీలకు రాజ్యాంగబద్ద పదవులు కట్టబెట్టాలంటే చట్టపరంగా సవరణలు చేయాల్సి ఉండడం ఆయనకు ప్రతికూలంగా మారింది. మరో వైపు ఆయన మంత్రి పదవి కూడా ఆశిస్తున్నాడు. అయితే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవుల ఆశావాహుల జాబితా భారీగా ఉండడంతో క్యాబినెట్ హోదా ఉన్న ఈ పదవితో ఆయనను సంతృప్తి పరిస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా ఉంది.

ఇక రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ గత కొంతకాలంగా రేవంత్ చర్యలకు మద్దతుగా నిలుస్తున్నాడు. సమాజంలోని అన్ని రంగాల మీద అనుభవం ఉన్న తటస్థుడయిన ఆయనకు ఈ పదవిని కట్టబెడితే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న ఒక ఆలోచన ఉంది. ఇక ప్రజా ఉద్యమాలు, హక్కుల నేతగా పేరున్న ప్రొఫెసర్ హరగోపాల్ కూడా ఈ పదవికి అర్హుడని, ఆయనకు ఇచ్చిన విద్యారంగంతో పాటు, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న వాదన వినిపిస్తుంది.

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ఎన్నికలకు ముందు నుండి రేవంత్ కు మద్దతుగా నిలుస్తూ వస్తున్నాడు. రేవంత్ కు సన్నిహితుడిగా పేరున్న ఆయనకు ఈ పదవి దక్కడం ఖాయం అని అంటున్నారు. అయితే ఏపీలో జగన్ ప్రభుత్వానికి విద్యారంగ సలహాదారుడిగా పనిచేసిన నేపథ్యంలో ఆయనకు ఇస్తే విమర్శలు వస్తాయని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ పదవి ఎవరికి దక్కుతుందో వేచిచూడాలి.

Tags:    

Similar News