హైడ్రాపై తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం!

చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను కాపాడడమే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Update: 2024-09-26 07:24 GMT

చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను కాపాడడమే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైడ్రా పరిధిని పెంచుతూ ఆదేశాలిచ్చిన రేవంత్.. తాజాగా మరింత పవర్స్ ఇచ్చారు. ఇటీవల చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్‌ డిసైడ్ చేసింది. అలాగే.. పలు అదనపు అధికారాలను ఇస్తూ నిర్ణయించారు. రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్‌ల నుంచి పలు బాధ్యతలను హైడ్రాకు అప్పగించారు.

హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు మరో నిర్ణయం తీసుకుంది. అదనపు సిబ్బంది కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. హైడ్రా కోసం మొత్తంగా 169 మంది సిబ్బందిని కేటాయించింది. నలుగురు అడిషనల్ కమిషనర్లు, ఐదుగురు డీసీపీలు, 16 మంది ఎస్సైలు, 60 మంది కానిస్టేబుళ్లు, 12 మంది స్టేషన్ ఫైర్ ఆఫీసర్లు, 10 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు డిప్యూటేషన్‌పై పనిచేస్తారు. వారితోపాటే ముగ్గురు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు, ఆరుగురు రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్లు, సమాచారం కోసం ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, అనలైటికల్ ఆఫీసర్, డిప్యూటీ అనలైటికల్ ఆఫీసర్, అసిస్టెంట్ అనలైటికల్ ఆఫీసర్, రీజనల్ ఫైర్ ఆఫీసర్, జిల్లా అదనపు అగ్నిప్రమాద శాఖ అధికారి, సిటీ ప్లానర్, ముగ్గురు డిప్యూటీ సిటీ ప్లానర్లు, నీటిపారుదల శాఖ ఈఈ, ముగ్గురు డీఈలు, పబ్లిక్ హెల్త్ నుంచి ఇద్దరు డీఈలు, ఆర్థిక శాఖ నుంచి ఒక డిప్యూటీ సెక్రటరీ, డిప్యూటీ కలెక్టర్, ముగ్గురు తహసీల్దార్లు, ముగ్గురు సర్వేయర్లను హైడ్రా కోసం నియమించారు.

ఇటీవలే చట్టబద్ధత కోసం ప్రతిపాదించడం.. జీహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖల నుంచి అధికారాలు బదలాయింపు కావడం.. తాజాగా సిబ్బందిని కేటాయించడంతో ఇక హైడ్రా మరింత దూసుకుపోనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వందలాదిగా నిర్మాణాలు నేలమట్టం కాగా.. ఎకరాల కొద్దీ భూమిని రికవరీ చేశారు. మొన్నటి వరకు అడపాదడపా ఉన్న సిబ్బందితోనే అంతటా చేసిన హైడ్రా.. అదనపు బలగం కూడా తోడవ్వడంతో.. ఇక ఆ దూకుడు ఏ స్థాయిలో ఉంటుందోనని అక్రమార్కుల్లో భయం పెరిగిపోయింది.

మరోవైపు.. ఇప్పటికే హైడ్రా విషయమై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. పెద్దోళ్లను వదిలి పేదలను గుడిసెలను కూల్చుతున్నారని, వారి ఆస్తులను బుగ్గి చేస్తున్నారని అంటున్నారు. పేదలు ఏడుస్తున్నా ప్రభుత్వం ఆపడం లేదని కామెంట్లు చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు, కొంత మంది ప్రజల నుంచి ఇలాంటి ప్రచారం జరుగుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డి రోజురోజుకూ మరింత బలోపేతం చేస్తుండడం గమనార్హం

Tags:    

Similar News