భూగోళం ఉన్నంతవరకు కాదని.. నాలుక మడతేశారేంది సారూ?

Update: 2023-08-02 04:51 GMT

అవసరానికి తగ్గట్లు మాటలు చెప్పే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తనకు నచ్చని విషయం ఏదైనా సరే పూచిక పుల్లను తీసేసినట్లుగా పక్కన పారేస్తారు. అయితే.. అలా తాను తీసి పారేసిన అంశానికి సంబంధించి రాజకీయ లబ్థి చేకూరుతుందన్న లెక్క కుదిరితే.. పాత విషయాల్ని పక్కన పెట్టేసి.. యూటర్న్ చేసుకొని నాలుక మడతేయటంలో ఆయనకున్న టాలెంట్ ఎంతన్న విషయం తాజాగా వైరల్ గా మారింది.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఏపీలోని జగన్ సర్కారు గతంలో నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 2019 అక్టోబరులో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసిన సందర్భంగా తెలంగాణ భవన్ లో కేసీఆర్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను ఒక మీడియా ప్రతినిధి.. ఏపీలో మాదిరి తెలంగాణలోనూ ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తూ నిర్ణయం తీసుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు.

దీనికి ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. మాటల్ని బాణాలు మాదిరి విసిరారు. ‘‘ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలపడమనే ఒక అంసబద్ధమైన, అసంభవమైన, అర్థరహితమైన, ఒక తెలివి తక్కువ నినాదాన్ని పట్టుకుంటరా? అదో నినాదమానండీ! నాకర్థం కాదు. ఒక పనికిమాలిన, పిచ్చి రాజకీయ పార్టీలు, తలకాయమాసినోడు, నెత్తిమాసినోడు.. గీళ్లా.. నాకర్థం కాదు. అర్థముండాలె కద! ఆర్టీసీ విలీనమనేది వందశాతం అసంభవం. గవర్నమెంట్‌లో కలపడమనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంతకాలం జరిగేది కాదు. ఏపీలో ఆర్టీసీ గవర్నమెంట్‌లో కలవడంపై చూద్దాం. అక్కడ ఏం జరిగిందో. వాళ్లు ఒక ఎక్స్‌పరిమెంట్‌ చేసిండ్రు. అక్కడ ఏం మన్ను కూడ జరగలేదు. మీకు (జర్నలిస్టులకు) తెల్వదు. అక్కడ కమిటీ వేసి.. మూడు నెలలకో, ఆరు నెలలకో ఏదో చెప్తరంట కథ. అది ఏం చెప్తరనేది చూడాలె. ఆర్టీసీ మునగక తప్పదు. ఎవ్వరూ కాపాడలేరు. ఆర్టీసీ సమ్మే కాదు.. ఆర్టీసీయే ముగుస్తుంది’’ అంటూ ఎడాపెడా మాటలు అనేశారు.

ఈ భూగోళం ఉన్నంతవరకు సాధ్యం కాదన్న కేసీఆర్.. సరిగ్గా నాలుగేళ్లు తిరిగేసరికి తన అభిప్రాయాన్ని మార్చుకొని.. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ తాజాగా కేబినెట్ నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. ఎన్నికలు ముంగిట్లోకి వచ్చిన వేళ.. ఆర్టీసీ ఉద్యోగుల ఓట్లు దాదాపు 2.5 లక్షలు ఉన్నందున.. వారి మనసుల్ని గెలుచుకోవటం కోసమే తాజా నిర్ణయమన్న మాట వినిపిస్తోంది.

ఒకప్పుడు సాధ్యమే కాదు.. తలకమాసినోడి మాటలంటూ నోరు పారేసుకున్న కేసీఆర్ మాటల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారింది. అందుకే అంటారు.. తొందరపడి మాట అనకూడదని.. అప్పుడేమో అంతలా విరుచుకుపడిన సీఎం కేసీఆర్.. ఇప్పుడేమంటారు? భూగోళం ఉన్నంతవరకు సాధ్యం కానిది ఇప్పుడెలా సాధ్యమైంది సారూ? అన్న ప్రశ్నలకు సమాధానం రాని పరిస్థితి.

Tags:    

Similar News