అసంతృప్తులకు పదవుల మందు వేస్తున్న కేసీఆర్

త్వరలో తెలంగాణ అసెంబ్లీకి జరగాల్సిన ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది.

Update: 2023-09-23 04:16 GMT

త్వరలో తెలంగాణ అసెంబ్లీకి జరగాల్సిన ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించాల్సి ఉంది. రాజకీయ వర్గాల అంచనాల ప్రకారం వచ్చే నెల (అక్టోబరు) ఆరున లేదంటే ఏడెనిమిది తారీఖుల్లో కేంద్ర ఎన్నికల సంఘం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి.. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తారన్న మాట బలంగా వినిపిస్తోంది. అయితే.. ఈ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో ముందే ప్రకటించేయటం తెలిసిందే. వేళ్ల మీద లెక్కేసే (4) అభ్యర్థుల స్థానాల్ని మినహాయించి మిగిలిన స్థానాలకు (115 స్థానాలకు) ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించటం తెలిసిందే. అయితే.. టికెట్లు ఆశించి దక్కని వారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలో తమను కాదని.. టికెట్లు దక్కిన వారు ఎలా గెలుస్తారో చూస్తామంటూ అసంతృప్తులు ఆగ్రహావేశాల్ని ప్రదర్శిస్తున్నారు.

ఇలాంటి వాటికి సంబంధించిన బుజ్జగింపులు మొదలయ్యాయి. ప్రగతిభవన్ ఇందుకు వేదికగా మారింది. టికెట్లు దక్కక గుర్రుగా ఉన్న పలువురు గులాబీ నేతల్ని ప్రగతిభవన్ కు ఆహ్వానించిన కేటీఆర్.. వారి మనసుల్ని దోచే ఆఫర్లను ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. శుక్రవారం ప్రగతిభవన్ లో చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. స్టేషన్ ఘన్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తాటికొండ రాజయ్యకు టికెట్ ఇవ్వకుండా.. కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వటంపై రాజయ్య నారాజ్ గా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రైవేటు సంభాషణల్లో కడియం గెలుపు ఎలా సాధ్యమో తాను చూస్తానన్న మాటను చెప్పినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఇలాంటి వేళ.. తాజాగా జరిగిన భేటీ అనంతరం కడియం శ్రీహరి ఎన్నిక కోసం తాను పని చేస్తానని రాజయ్య చెప్పటం ఆసక్తికరంగా మారింది. ఇందుకు ప్రతిఫలంగా తెలంగాణ రాష్ట్ర రైతుబంధు సమితి ఛైర్మన్ గా ఆయన్ను ప్రకటించటం గమనార్హం.

అంతేకాదు.. జనగామ టికెట్ కోసం ఫైట్ చేస్తున్న ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డిని టీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా ఎంపిక చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో.. ఈ ఇద్దరు నేతల అసంతృప్తికి మంత్రి కేటీఆర్ తన విందు రాజకీయంతో పరిష్కారం వెతికినట్లుగా చెబుతున్నారు. ఇదే రీతిలో.. మిగిలిన అసంతృప్తులకు తమదైన శైలిలో సర్దిచెప్పి.. వారికి పదవుల ఆశ చూపి తమ దారికి తెచ్చుకోవాలన్న యోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. మరి.. ఈ తరహా రాజకీయం ఎలాంటి ఫలితాల్ని అందిస్తుందో కాలమే సరైన సమాధానం చెప్పగలదు. అప్పటివరకు వెయిట్ చేయక తప్పదు.

Tags:    

Similar News