తెలంగాణా ఆర్టీసీ బిల్లు...గవర్నర్ సంచలన నిర్ణయం
తెలంగాణా గవర్నర్ తమిళ్ సై సౌందర్యరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణా గవర్నర్ తమిళ్ సై సౌందర్యరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ బిల్లుని న్యాయ సలహా కోసం న్యాయ శాఖ కార్యదర్శికి పంపించినట్లుగా రాజ్ భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ బిల్లు విషయంలో తాను చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకున్నారా లేదా పరిశీలించమని గవర్నర్ కోరినట్లుగా రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి.
అర్టీసీ కార్మికుల సంక్షేమం కోసమే గవర్నర్ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారని రాజ్ భవన్ వర్గాలు అంటున్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినా ఆర్టీసీ ఆస్తులు అలాగే ఉంచాలని, అదే విధంగా ఉద్యోగుల శ్రేయస్సు, కార్పోరేషన్ బాగు కూడా చూసుకోవాలని గవర్నర్ భావిస్తున్నారు అని అంటున్నారు.
విలీనం తరువాత కూడా ఆర్టీసీ ఆస్తులు భూములు యాజమాన్యం చేతిలోనే ఉండాలని గవర్నర్ సిఫార్స్ చేసినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి అనుగుణంగానే విభజన పూర్తి చేయాలని సూచించారని అంటున్నారు. అలాగే ఉమ్మడి ఏపీఎసార్టీసీ నుంచి ఉద్యోగులకు అందాల్సిన బకాయిల మీద చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారని భోగట్టా.
విలీనం తరువాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పే స్కేల్స్ తో పాటు ఇతర సర్వీస్ నిబంధలను అన్నీ ఉండాలని గవర్నర్ చేసిన సిఫార్సులో ఉందని అంటున్నారు. అదే విధంగా వేతనాలు, బదిలీలు, పదోన్నతులు, పదవీ విరమణ పింఛన్లు, పీఎఫ్, గ్రాట్యూటీ, ఇలా అన్ని సదుపాయాలు కల్పించాలన్నది గవర్నర్ సిఫార్సులలో ఉన్న మరో ముఖ్య ఉద్దేశ్యం.
ఇక విలీనం తరువాత ఆర్టీసీ సర్వీస్ నిబంధలను పూర్తిగా మార్చాలని అవి మానవీయ కోణంలో ఉండాలని సూచించారని తెలుస్తోంది. ఇక విలీనం తరువాత ఆర్టీసీ ఉద్యోగులను వేరే శాఖలకు డెప్యుటేషన్ మీద పంపించినా కూడా వారికి అక్కడ తగిన ఉద్యోగ భద్రత రక్షణ ఉండాలన్నది మరో సిఫార్సుగా ఉంది.
అర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్య బీమాతో పాటు అత్య్త్తమ వైద్య సేవలను అందించాలన్నది మరో సూచన. ఆర్టీసీ కారుణ్య నియామకాలకు తగిన అవకాశం కల్పించాలని మరో కీలక సిఫార్స్ కూడా చేశారు. ఎందుకంటే ఆర్టీసీలో ఉద్యోగులు కఠినమైన పరిస్థితులలో పనిచేయాల్సి ఉంటుంది. దానికి తగినట్లుగా వారికి రూల్స్ ఉండాలి. తాము పనిచేయలేని పరిస్థితి వస్తే తమ వారసులకు అవకాశం కల్పించేలా నిబంధలను ఉండాలన్నది ఆ సిఫార్స్.
ఏది ఏమైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినపుడు దానికి తగినట్లుగా వారికి తగిన భద్రత రక్షణ వంటిని కల్పించడం కోసేమే గవర్నర్ సిఫార్సులు చేశారని, ఇందులో వేరే దురుద్దేశ్యాలు లేవని, అసత్య ప్రచారాన్ని ఆర్టీసీ ఉద్యోగులు నమ్మరాదని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి చూస్తే ఆర్టీసీ బిల్లు అధికార బీయారెస్ రాజ్ భవన్ వర్గాల మధ్య మరోసారి చిచ్చు పెట్టేలాగానే ఉంది అని అంటున్నారు.