"పుష్ప" పాటలో లైన్లు...గవర్నర్ తమిళ సై సంచలన వ్యాఖ్యలు!

తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళ సై ఒక సంచలనం అని చెప్పేవారు లేకపోలేదు.

Update: 2023-09-30 08:24 GMT

తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తమిళ సై ఒక సంచలనం అని చెప్పేవారు లేకపోలేదు. రాజకీయాలకు అతీతంగా ఆమెకు ఒక ఫ్యాన్ బెల్ట్ ఉందని చెబుతుంటారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి నేడు ఈ స్థాయికి వచ్చిన ఆమె జీవితం, అందులో దాగున్న పోరాట పటిమ ఎంతోమంది మహిళలకు ఆదర్శం అని అంటుంటారు. ఈ సమయంలో తాజాగా రాజ్ భవన్ లో జరిగిన సభలో తెలంగాణ గవర్నర్ తమిళ సై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ కృతజ్ఞత సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించిన ప్రధాని మోడీకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తెలంగాణ అధికార బీఆరెస్స్ పార్టీపైనా తనదైన శైలిలో స్పందించారు. ఈ సందర్భంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందులో, ఎదుర్కొంటున్న ఇబ్బందులో... కారణం తెలియదు కానీ సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళ సై!

అవును... గవర్నర్‌ గా తెలంగాణలో తాను అడుగుపెట్టిన సమయానికి కేబినెట్‌ లో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు అని గుర్తుచేసిన తమిళసై... తాను వచ్చాక ఇద్దరు మహిళా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించానని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో... తాను రావడంతో ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం రావడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఇక రాజకీయాలపై ఇష్టం వల్లే వైద్య వృత్తికి దూరంగా ఉన్నట్లు తెలిపిన గవర్నర్... రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువగా ఉంటుందని అన్నారు. తాను ఒకప్పుడు బీజేపీ నేతనే అయినప్పటికీ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా గవర్నర్ ని అని తెలిపారు. ఇదే సమయంలో ప్రభుత్వం ప్రొటోకాల్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుంటూ పోతా అని తమిళ సై స్పష్టం చేశారని తెలుస్తుంది.

అనంతరం... "నాపై పువ్వులు వేసే వారు ఉన్నారు.. రాళ్లు వేసే వారూ ఉన్నారు. నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా. నాపై పిన్స్‌ వేస్తే.. ఆ పిన్స్‌ గుచ్చుకుని వచ్చే రక్తంతో నా చరిత్ర బుక్‌ రాసుకుంటా. అందరూ అందరికి నచ్చాలని లేదు. నాపై పువ్వులు వేసినా.. రాళ్లు వేసినా ఆహ్వానిస్తా.. ఎలాంటి అవమానాలు పట్టించుకోకుండా ప్రజల కోసం పనిచేస్తా" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఇదే సమయంలో తమిళసై అభిమానులు మాత్రం... ఆమె మాటలకు "పుష్ప" సినిమాలో పాటను గుర్తు చేసుకుంటున్నారు. "ఎవడ్రా ఎవడ్రా నువ్వు... ఇనుమును ఇనుమును నేను - నను కాల్చితే కత్తౌతాను! మట్టిని మట్టిని నేను - నను తొక్కితే ఇటుకౌతాను! రాయిని రాయిని నేను - గాయం కానీ చేసారంటే ఖాయంగా దేవుడ్నౌతాను!" అనే పాటను గుర్తుకు తెచ్చుకుంటూ.. గవర్నర్ తమిళ సై ఎంతో మంది మహిళలకు ఆదర్శం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags:    

Similar News