సీనియర్ల అవసరం టీడీపీకి లేదా...!?
తెలుగుదేశం పార్టీ అంటే సీనియర్లతో నిండిన ఒక వృద్ధ పార్టీ అని ప్రత్యర్ధులు వేళాకోళం చేస్తూ ఉంటారు
తెలుగుదేశం పార్టీ అంటే సీనియర్లతో నిండిన ఒక వృద్ధ పార్టీ అని ప్రత్యర్ధులు వేళాకోళం చేస్తూ ఉంటారు. టీడీపీ వయసు నలభై రెండు అయితే ఆ పార్టీలో సగటు పొలిటీషియన్ వయసు 60 ఏళ్ళు అని అంటారు. టీడీపీకి కొత్త రక్తం ఎక్కిస్తాను యువతకు పెద్ద పీట వేస్తాను అని అధినేత చంద్రబాబు ప్రతీ ఎన్నికల్లోనూ చెబుతూ ఉంటారు. కానీ ఆచరణకు వచ్చేసరికి సీనియర్లకే అగ్ర తాంబూలం అందిస్తూ ఉంటారు.
కానీ ఈసారి మాత్రం చంద్రబాబు ట్రెండ్ మార్చారు దీని వెనక ఉన్నది నారా లోకేష్ అని అంటున్నారు. మొత్తానికి మొత్తం సీనియర్లను తీసి పక్కన పెట్టకపోయినా చాలా మందిని సైడ్ చేసేశారు అని అంటున్నారు. ఆ జాబితా కనుక చూస్తే ఉత్తరాంధ్రాలో మాజీ మంత్రులు గుండ అప్పల సూర్యనారాయణ, కిమిడి కళా వెంకటరావు, అశోక్ గజపతిరాజు, సుజయ క్రిష్ణ రంగారావు, పతివాడ నారాయణస్వామి, బండారు సత్యనారాయణమూర్తి, దాడి వీరభద్రరావు, గంటా శ్రీనివాసరావు వంటి వారు ఉన్నారు.
ఇక ఇతర జిల్లాల విషయానికి వస్తే మాజీ మంత్రులు పీతల సుజాత, జవహర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు కనిపిస్తారు. ఇక సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యేల లిస్ట్ చూస్తే చాలా పెద్దదే. మరి వీరిని ఎందుకు బాబు దూరం పెట్టారు అంటే వారి వల్ల పార్టీకి కొత్తగా యాడ్ అయ్యేది లేదనే అని అంటున్నారు. వారు పార్టీ వల్లనే గెలుస్తున్నారు తప్ప పార్టీకి ఉపయోగం లేదని నిర్ణయానికి రావడమే అంటున్నారు.
అంతే కాదు వీరిని పార్టీని ఎపుడూ భరిస్తూ టికెట్లు ఇస్తూ పోతూంటే కొత్త వారికి చాన్స్ రాదని అంటున్నారు. ఇక ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీ యువతకు పెద్ద పీట వేస్తోంది. దాంతో పాటు ఆ పార్టీ నేతల సగటు వయసు 45 నుంచి 50 లోపు ఉంటోంది. ఈ కారణంగా టీడీపీకి యూత్ ఫ్లేవర్ ఉండాలని భావించే ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు అని అంటున్నారు.
అంతే కాదు మరో వైపు నారా లోకేష్ కి పార్టీ నాయకత్వం 2024 నుంచి 2029 మధ్యలో సాఫీగా వెళ్లేలా చూస్తున్నారు. దాని కోసం కూడా వీలైన చోట్ల యూత్ కి కొత్త వారికి టికెట్లు ఇచ్చి లోకేష్ పట్ల వారిని విధేయులుగా ఉండేలా చూస్తు న్నారు అని అంటున్నారు. యనమల రామక్రిష్ణుడు కుమార్తె దివ్యకు టికెట్ ఇవ్వడం అశోక్ గజపతిరాజు కుమ్మార్తె అదితి గజపతిరాజుకు సీటు ఇవ్వడం, శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్ నాయుడుని ప్రోత్సహించడం వంటివి ఇందులో భాగమే అని అంటున్నారు.
మొత్తం మీద చూస్తే టీడీపీ సీనియర్లను పక్కన పెట్టింది. అయితే వారి సేవలను పార్టీ కోసం వాడుకుంటామని చెబుతోంది. మరి సీనియర్లలో ఎంతమంది పార్టీ తీసుకున్న డెసిషన్ కి తలవొగ్గి పార్టీని అనుసరిస్తారు అన్నది చూడాల్సి ఉంది.