రాంగ్ రూట్ లో కారు డ్రైవ్ చేసి.. ట్రాఫిక్ సిబ్బందిపై దాడి చేసిన నటి
దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. వెంటనే సదరు హోంగార్డుపై కేకలు వేస్తూ.. అతను ధరించిన లైఫ్ జాకెట్ ను చించేయటం.. చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను పగలకొట్టారు.
చేసింది తప్పుడు పని. మళ్లీ దానికో బుకాయింపు. అదేమంటే.. ట్రాఫిక్ సిబ్బంది తనను మాట అన్నాడంటూ రెచ్చిపోయిన మహిళ లెక్కను పోలీసులు తేల్చారు. ఈ నెల 24న రాత్రి వేళలో బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 12లోని అగ్రసేన్ కూడలిలో రాంగ్ రూట్ లో తన జాగ్వార్ కారులో వచ్చిన మహిళను.. అక్కడ విధులు నిర్వహిస్తున్న హోంగార్డు నిలువరించారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆమె.. వెంటనే సదరు హోంగార్డుపై కేకలు వేస్తూ.. అతను ధరించిన లైఫ్ జాకెట్ ను చించేయటం.. చేతిలో ఉన్న సెల్ ఫోన్ ను పగలకొట్టారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ వ్యవహారం షాకింగ్ గా మారింది. దీనిపై సీరియస్ గా స్పందించిన పోలీసులు సదరు మహిళ ఎవరన్న దానిపై లెక్క తేల్చారు. ఆమె ఎవరో కాదు.. సినీ నటి సౌమ్య జానూగా గుర్తించారు. హోంగార్డు విఘ్నేష్ తో అనుచితంగా వ్యవహరించిన ఆమెపై కేసు నమోదైంది. ఆమెను గుర్తించిన పోలీసులు.. ఆమె ఇంటికి వెళ్లగా ఇంట్లో లేరన్న సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. ఆమె సెల్ ఫోన్ సైతం పని చేయటం లేదు.
ఈ ఉదంతంలో మరో ట్విస్టు ఏమంటే.. పోలీసులకు అందుబాటులోకి రాకుండా ఉండిపోయిన ఆమె.. ఒక టీవీ చానల్ తో మాత్రం మాట్లాడారు. తాను మెడికల్ ఎమర్జెన్సీ కోసం రాంగ్ రూట్ లో వెళ్లానని.. పోలీసులు తనను క్షమించాలని కోరారు. విధుల్లో ఉన్న పోలీసులు తనను అసభ్యంగా దూషించటంతో తాను అలా రియాక్టు అయినట్లుగా ఆరోపించారు. అతడిపై దాడి చేయలేదని.. తనను పోలీసులు విచారణకు పిలవలేదని పేర్కొనటం గమనార్హం. విధుల్లో ఉన్న హోంగార్డుపై దాడి చేయటమే కాదు.. మళ్లీ రివర్సులో ఈ తరహా ఆరోపణలు చేస్తున్న నటి సౌమ్య జానుపై పై పోలీసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.