హౌతీలు ఆపడంలేదు... ఎర్ర సముద్రం విషయంలో కొత్త ఆప్షన్?

ఇందులో భాగంగా హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో దాడులను మరింత తీవ్రతరం చేస్తున్నారు.

Update: 2024-01-01 00:30 GMT

ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధం ప్రారంభమైన అనంతరం ఎర్ర సముద్రంలోని అలజడులు సృష్టించబడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో దాడులను మరింత తీవ్రతరం చేస్తున్నారు. దీనికోసం బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, ఇటలీ, బహ్రెయిన్‌, నెదర్లాండ్స్‌, నార్వే, స్పెయిన్‌, సీషెల్స్‌ వంటి పది దేశాలు అమెరికా నేతృత్వంలో ఎర్ర సముద్రంలో నౌకల రక్షణ కోసం "ఆపరేషన్‌ ప్రాస్పరిటీ గార్డియన్‌"ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ హౌతీలు తగ్గడం లేదు.

అవును... సుమారు 10 రోజుల క్రితం అమెరికా నేతృత్వంలో "ఆపరేషన్‌ ప్రాస్పెరిటీ గార్డియన్‌" చేపట్టిన తర్వాత తొలిసారి ఎర్ర సముద్రంలో ఓ నౌకపై క్షిపణి దాడి జరిగింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ కూడా ధ్రువీకరించింది. ది మెర్స్క్‌ హాంగ్‌ ఝూ అనే కంటైనర్‌ నౌకపై హౌతీలు క్షిపణి దాడి చేశారు. సుమారు 10 రోజుల క్రితం జరిగిన తొలి దాడి ఇది. ఈ సమయంలో ఆ క్షిపణితో పాటు మరో రెండు బాలిస్టిక్‌ క్షిపణులను అమెరికా యుద్ధ నౌక యూ.ఎస్.ఏ. గ్రావ్‌ లీ కూల్చివేసింది.

వాస్తవానికి ది మెర్స్క్‌ హాంగ్‌ ఝూ అనే కంటైనర్‌ నౌకపై హౌతీలు క్షిపణి దాడికి కొన్ని గంటల ముందు అమెరికా నేవీకి చెందిన వైస్‌ అడ్మిరల్‌ బ్రాడ్‌ కూపర్‌ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ... ఆపరేషన్‌ ప్రాస్పెరిటీ గార్డియన్‌ చేపట్టిన తర్వాత దాదాపు 1200 వాణిజ్య నౌకలను సురక్షితంగా ఎర్ర సముద్రం దాటించినట్లు వెల్లడించారు. వాటిపై ఎలాంటీ దాడీ జరగలేదని తెలిపారు.

ఈ నేపథ్యంలో కూపర్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది గంటల్లోనే ది మెర్స్క్‌ హాంగ్‌ ఝూ పై దాడి జరిగింది. ఇలా అమెరికా నేతృత్వంలో సుమారు 10దేశాలు ఐకమత్యంగా దాడులను ఎదుక్రొనేందుకుంటున్నా కూడా ఎర్ర సముద్రంలో దాడులు పెరగడంతో.. ప్రపంచంలోనే పెద్ద షిప్పింగ్‌ సంస్థల్లో ఒకటైన మెర్స్క్‌ తమ రవాణా నౌకలను సూయజ్‌ నుంచి కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ వైపు మళ్లించింది.

కాగా... "టాస్క్‌ ఫోర్స్‌ 153" నాయకత్వం వహిస్తున్న "ఆపరేషన్‌ ప్రాస్పెరిటీ గార్డియన్‌" కోసం అమెరికా, ఫ్రాన్స్‌, యూకేకు చెందిన ఐదు యుద్ధ నౌకలు ఈ సముద్రంలో గస్తీ కాస్తున్న సంగతి తెలిసిందే. ఇవి ప్రధానంగా ఎర్ర సముద్రంతో పాటు పశ్చిమ గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ లోనూ పహారా కాస్తున్నాయి. ఈ ఆపరేషన్‌ మొదలైన నాటి నుంచి సుమారు 17 డ్రోన్లు, నాలుగు యాంటీ షిప్‌ బాలిస్టిక్‌ క్షిపణులను ఇవి కూల్చేశాయి.

ఈ నేపథ్యంలో మరోసారి హాంగ్‌ ఝూ అనే కంటైనర్‌ నౌకపై హౌతీలు క్షిపణి దాడి చేశారు. ఎవరు ఎన్ని చర్యలు తీసుకున్నా... ఇజ్రాయెల్‌ కు వెళుతున్న నౌకలను లక్ష్యంగా చేసుకొంటామని వారు ప్రకటించారు! దీంతో… ఎర్రసముద్రంలో నౌకలకు రక్షణ కల్పించే విషయంలో కొత్త ఆప్షన్ ఏమీ లేదా అనే చర్చ తెరపైకి వచ్చింది.

Tags:    

Similar News