నాటి ముందస్తే నేడు కేసీఆర్ బీఆర్ఎస్ కు శాపమైంది..

తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి.

Update: 2024-03-25 15:30 GMT

తెలంగాణలో ప్రస్తుతం ఉనికి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్. అదేంటి..? పదేళ్లు ఏకధాటిగా అధికారంలో ఉండి..ఉద్యమ పార్టీగా అత్యంత ప్రభావం చూపిన బీఆర్ఎస్ కేవలం ఎన్నికలు ముగిసిన మూడు నెలలకే.. అధికారం కోల్పోయిన వంద రోజులకే ఇంతటి దుర్భర పరిస్థితుల్లో చిక్కుకుంటుందా? అనిపించేలా ఉంది రాజకీయం. కానీ, దీనికి పునాది ఐదున్నరేళ్ల కిందటే పడింది.

ఒక్కొక్కరుగా వలస

తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. సిటింగ్ ఎంపీలు నలుగురు ఆ పార్టీని వీడారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో ఎమ్మెల్యేల జంపింగ్ కూడా మొదలైందని స్పష్టమవుతోంది. ఇక పలువురు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా కారు దిగుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు బీఆర్ఎస్ చేజారుతున్నాయి.

అసెంబ్లీ, లోక్ సభ విడివిడి కావడంతో

తెలంగాణలో 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కు 2019 మే వరకు పాలన సాగించేందుకు గడువుంది. కానీ, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ముందుస్తు ఎన్నికలకు వెళ్లడంతో 2018 నవంబరులో పోలింగ్ జరిగింది. అప్పటి వాతావరణం బట్టి బీఆర్ఎస్ ఘనవిజయం సాధించింది. ఇక 2019 లోక్ సభ ఎన్నికల్లో సారు-కారు-పదహారు నినాదంతో వెళ్లినా 9 సీట్లకు పరిమితమైంది. నాడు అసెంబ్లీలో ఘోరంగా దెబ్బతిన్న బీజేపీ, కాంగ్రెస్ ఆరు నెలల తర్వాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన స్థానాలు సాధించాయి.

నాటి దెబ్బ.. నేడు ప్రభావం

ఇక ఇప్పటి బీఆర్ఎస్ పరిస్థితికి వస్తే 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్ సభ ఎన్నికల వరకు సాఫీగానే సాగింది. మొన్నటి ఎన్నికల్లో ఓటమితోనే దెబ్బపడింది. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ ఖాయమనే ధీమాతో వెళ్లి పరాజయం పాలవడంతో ఆ పార్టీకి నాయకులు గుడ్ బై చెబుతున్నారు. ఇలా కాకుండా అసెంబ్లీ-లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరిగి ఉంటే వారికి పార్టీ మారాలనే ఆలోచన వచ్చి ఉండేది కాదేమో? ఎందుకంటే.. రెండు ప్రధాన ఎన్నికలు ఒకేసారి జరిగితే తర్వాత ఇక ఎన్నికలు ఉండేవి కాదు. దీంతో నాయకులు పక్కచూపులు చూసేవారు కాదు. ఉదాహరణకు దానం నాగేందర్ గనుక లోక్ సభ ఎన్నికలు లేకుంటే బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేవారా? చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి మారి కాంగ్రెస్ టికెట్ తెచ్చుకునే చాన్సుండేదా? జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలోకి వెళ్లేవారా? ఇలా చెప్పుకొంటూ పోతే 2018లో ముందుస్తుకు వెళ్లడం అప్పటికి కేసీఆర్ తీసుకున్న సరైన నిర్ణయమే. కానీ, ఇప్పుడు చూస్తేనే దెబ్బపడిందని తెలుస్తోంది.

Tags:    

Similar News