సాంకేతిక సమస్యలతో హడలెత్తిస్తున్న హైదరాబాద్ మెట్రో.. రోజులో 2 చోట్ల!
వీటితో సంబంధం లేకుండా హైదరాబాద్ మెట్రో ఇప్పుడో తలనొప్పిగా మారింది
హైదరాబాద్ ప్రజలకు మరో కష్టం వచ్చి పడింది. మొన్నటి వరకు మండే ఎండలతో ఒకలాంటి తిప్పలు పడితే.. తాజాగా కురుస్తున్న వానలతో మరోలాంటి కష్టం ఏర్పడుతుంది. వీటితో సంబంధం లేకుండా హైదరాబాద్ మెట్రో ఇప్పుడో తలనొప్పిగా మారింది. నిజానికి.. హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించి చూస్తే.. అప్పుడప్పడు ఎదురయ్యే సాంకేతిక సమస్యలు కాస్తంత ఇబ్బంది పెట్టినా.. బుధవారం చోటు చేసుకున్న రెండు టెక్నికల్ అంశాలు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి.
మియాపూర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే మెట్రో రైల్ ఇర్రమంజిల్ స్టేషన్ వద్దకు వచ్చేసరికి ట్రైన్ డోర్లు తెరుచుకోలేదు. దీంతో.. ట్రైన్ లోని వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీనికి తోడు ఆ టైంలో ఏసీ తక్కువగా ఉండటంతో చెమటలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కాసేపటికి సమస్యను పరిష్కరించినప్పటికీ.. తమకు ఎదురైన చేదు అనుభవంతో మాత్రం ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యారు.
ఇది సరిపోనట్లుగా.. బుధవారం రాత్రి ఎల్ బీ నగర్ మెట్రో స్టేషన్ లో మరో విచిత్రమైన సాంకేతిక సమస్య ఎదురై.. ప్రయాణికుల సహనానికి పరీక్షలు పెట్టింది. జరిగిందేమంటే.. మెట్రో ట్రైన్ దిగి స్టేషన్ బయటకు వచ్చే వేళలో ప్రయాణికులు తమ చేతిలో ఉన్న టోకెన్ కానీ.. పాస్ తో సహా ఏది ఉన్నా సరే ఎగ్జిట్ గేట్ ఓపెన్ కాని పరిస్థితి. ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు సిబ్బంది ప్రయత్నించినా ఫలించలేదు.
దీంతో ట్రైన్ దిగిన ప్రయాణికులు బయటకు వెళ్లలేక క్యూలైన్ లో ఎక్కువ సేపు వేచి చూడాల్సిన వచ్చింది. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన మెట్రో ప్రయాణికులు తమ నిరసనను తెలియజేశారు. చివరకు కిందా మీదా పడిన మెట్రో అధికారులు గేట్ ఓపెన్ సమస్యను పరిష్కరించారు. ఇలా రెండు సంఘటనలు ఒకే రోజు చోటు చేసుకోవటం.. ఈ రెండింటి కారణంగా మెట్రో ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురయ్యేలా చేసింది. ఇప్పటికైనా హైదరాబాద్ మెట్రో వారు స్పందించాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.