మోడీకి ఆరు నెలలు టార్గెట్ ఇచ్చిన చంద్రబాబు అండ్ నితీష్ !
అలా ఎవరినీ సంప్రదించ అవసరం లేకుండా అంతా సాఫీగా సాగిపోయింది.
నరేంద్ర మోడీ అరవీర భయంకర వీరుడు. అజేయుడు. ఓటమి ఎరుగని మహా నాయకుడు. ఇలా ఎన్నో బిరుదులతో ఆయన వర్ధిల్లారు. పదేళ్ల పాటు తన కత్తికి ఎదురులేకుండా నిలిచారు. దేశంలో తాను అనుకున్నది చేయగలిగారు. దానికి కారణం బీజేపీకి కేంద్రంలో సొంతంగా పూర్తి మెజారిటీ ఉండడం. అలా ఎవరినీ సంప్రదించ అవసరం లేకుండా అంతా సాఫీగా సాగిపోయింది.
కానీ ఇపుడు కంప్లీట్ గా సీన్ మారిపోయింది. మోడీ ఇద్దరి మీద ఆధార పడ్డారు. ఇది మోడీ టోటల్ పాలిటిక్స్ లోనే ఎపుడూ ఫేస్ చేయని పొలిటికల్ ఎక్సిపీరియెన్స్ అని చెప్పాలి.గుజరాత్ లో పదమూడేళ్ళు సీఎం గా చేసినా పదేళ్ళు కేంద్రంలో పీఎం గా చేసినా మోడీ మాటే శాసనం.
ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే తిరుగే లేదు. కానీ అలాంటిది మోడీ ఇపుడు ఇద్దరు బలమైన ప్రాంతీయ పార్టీ అధినేతల మీద ఆధారపడి ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఇద్దరూ కూడా అనన్య సామాన్యులు. మోడీ కంటే ముందే రాజకీయాల్లో ఉండి పదవులు చేపట్టిన వారు. ఢక్కామెక్కీలు తిన్నవారు.
వారే ఏపీకి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు. అలాగే బీహార్ కి చెందిన నితీష్ కుమార్. ఈ ఇద్దరూ సర్వ జనామోదం పొందిన వారు. అంటే అన్ని పార్టీలలో వారికి మిత్రులు ఉన్నారు అని అర్ధం. బీజేపీ కాంగ్రెస్ ల మధ్య ఆజన్మ వైరం ఉంది. కానీ ఈ ఇద్దరూ కూడా అటు కాంగ్రెస్ లోనూ సులువుగా పొత్తు కలపగలరు, అలాగే బీజేపీతో కలసి నడవగలరు.
ఇక కేంద్రంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి 233 సీట్లు దక్కాయి. దాంతో కూటమి కేవలం నలభై సీట్ల తేడాతో అధికారానికి దగ్గరలో ఉంది. బీజేపీకి 240 సీట్లు దక్కాయి. దాంతో 32 సీట్ల గ్యాప్ తో ఉంది. ఎన్నికలకు ముందు మోడీ చేసిన మంచి పని ఏమిటి అంటే చంద్రబాబుని నితీష్ కుమార్ ని ఎన్డీయే జట్టులోకి తీసుకోవడం. అలా అంతా కలసి పోటీ చేసి విజయం సాధించారు.
దాంతో ఎన్డీయే మిత్రులుగా బాబు నితీష్ నిబద్ధతతో వ్యవహరిస్తూ ఎన్డీయే కూటమిలో ఉన్నారు. మోడీని ప్రధానిగా చేసేందుకు వారు అంగీకారం చెబుతూనే ఆరు నెలల కచ్చితమైన సమయం మోడీకి ఇచ్చారు అని ప్రచారం ఢిల్లీ స్థాయిలో సాగుతోంది. ఈ ఏడాది డిసెంబర్ లోగా అంటే 2024 క్యాలెండర్ ఇయర్ ముగిసేలోగా కేంద్రం తమ రాష్ట్రాలకు మేలు చేసే విధంగా హామీలను తీర్చకపోతే మాత్రం తాము చేయాల్సింది చేస్తామన్నట్లుగా బాబు నితీష్ కుమార్ ల కండిషన్ ఉంది అని అంటున్నారు.
అంటే కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ప్రధాని పీఠం మీద మోడీని ఉంచి తమ రాష్ట్రాలకు తాము కోరుకున్న అభివృద్ధి చేసుకోవాలని వారి ఆలోచనగా ఉంది. వాటిని చేస్తే మోడీకి సపోర్ట్ కంటిన్యూ అవుతుంది లేకపోతే లేదు అన్నట్లుగానే ఈ ప్రచారం ఉంది. ఇంతకీ ఆ కండిషన్లు ఏమిటి అంటే చంద్రబాబు అనేక రకాలైన హామీలు ఇచ్చి ఏపీలో అధికారం చేపట్టారు. ఏపీ చూస్తే అప్పుల కుప్పగా ఉంది.
బాబు ఇచ్చిన హామీలు అన్నీ తీర్చాలీ అంటే పది లక్షల కోట్ల రూపాయలు అవసరం పడతాయి. అలా ఉదారంగా అంత పెద్ద మొత్తాన్ని ఏపీకి సాయంగా చేయమని బాబు కోరినట్లుగా చెబుతున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసుకోవాలి. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి కూడా కేంద్రం నుంచి భారీ ఎత్తున ఆర్ధిక సాయం రావాలి.
ఇక నితీష్ కుమార్ కూడా బీహార్ విషయంలో కొన్ని కచ్చితమైన హామీలు తీసుకున్నారు అని అంటున్నారు. బీహార్ స్టేట్ లో ఉన్న సమస్యల మీద ఆయన కేంద్రం సాయం కోరుతున్నారు. దాంతో ఆరు నెలల సమయం ఇచ్చారు. ఆరు నెలల సమయంలో ఈ హామీలు అన్నీ మోడీ తీర్చకపోతే ఎన్డీయేకు రాం రాం చెప్పడానికి ఈ నేతలు ఇద్దరూ సిద్ధపడతారా అంటే అవును అని ఢిల్లీ వర్గాలు అంటున్నారు.
ఈసారి అంటే ఈ టెర్మ్ లోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది అని అంటున్నారు. ఇక బీహార్ లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తో నితీష్ టచ్ లో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ అగ్ర నేతలతో కూడా ఆయన టచ్ లో ఉన్నారు. నితీష్ కి ఈ జంపింగులు అలవాటే అని కూడా అంటున్నారు.
మరో వైపు చంద్రబాబు కూడా కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో టచ్ లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి బాబుకు భారీ ఆఫర్లు వచ్చినా ఆయన పొత్తు ధర్మం ఏపీ క్షేమం దృష్టిలో ఉంచుకునే మోడీకి మద్దతు ఇచ్చారు అని అంటున్నారు.
చెప్పినట్లుగా ఏపీకి మోడీ సాయం చేయకపోతే మాత్రం అటు నితీష్ ఇటు చంద్రబాబు ఎన్డీఏకు గుడ్ బై కొట్టినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. అదే టైం లో ఇండియా కూటమి వైపు వారు అడుగులు వేసినా వేస్తారు అని అంటున్నారు. మొత్తానికి మోడీ పీఎం కుర్చీ మూడు నాళ్ళ ముచ్చటేనా అంటే ఢిల్లీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాటను బట్టి అదే నిజం అని అంటున్నారుట.