వాట్సప్ గ్రూపులో ఫోటోలు తీసేశారని ఇద్దరి హత్య !
ఈ నెల 4న తన విల్లాలో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న రవి తన ఫోటోలు దిగి వాటిని తమ గ్రామంలోని వాట్సప్ గ్రూపులో పెట్టాడు.
తమ ఊరిలోని వాట్సాప్ గ్రూపులో తన ఫొటోలు తొలగించారని ఒక బీజేపీ నాయకుడు ఇద్దరిని హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో కలకలం రేపింది. కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందిన బీజేపీ నేత జల్కం రవి కడ్తాల్ సమీపంలోని బటర్‌ఫ్లై సిటీ వెంచర్‌లో ఓ విల్లాను అద్దెకు తీసుకొని రియల్ ఎస్టే ట్ వ్యాపారం చేస్తున్నాడు.
ఈ నెల 4న తన విల్లాలో పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న రవి తన ఫోటోలు దిగి వాటిని తమ గ్రామంలోని వాట్సప్ గ్రూపులో పెట్టాడు. అధిక సంఖ్యలో ఫోటోలు పెట్టడంతో గ్రామానికి చెందిన శేషగారి శివగౌడ్(27), గుండెమోని శివగౌడ్ (25) అభ్యంతరం వ్యక్తం చేసి, ఫొటోలను గ్రూప్ నుంచి తొలగించారు. ఇది మనసులో పెట్టుకున్న రవి వారిద్దరినీ విల్లాకు వారిని పిలిపించుకున్నాడు.
ఆ ఇద్దరితో పాటు మరో స్నేహితుడితో కలిసి మద్యం సేవిస్తున్న సమయంలో ఫొటోల తొలగింపు విషయమై వివాదం చెలరేగింది. ఈ క్రమం లో ఆ ఇద్దరు యువకులపై రవి, రాజుగౌడ్ పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపి, విల్లాకు తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ సంఘటన ఈ ప్రాంతంలో ప్రస్తుతం కలకలం రేపుతున్నది.