అమెరికా 'తెరుచుకుంది'.. మళ్లీ ఆ గండం తప్పింది..
అది కూడా ఆరేళ్లలో రెండోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తిందంటే ఏమనుకుంటారు..?
ఆర్థిక బిల్లుల చెల్లింపు ఆగిపోవడం అంటే ఏ దేశానికైనా అవమానమే.. అందులోనూ అగ్రరాజ్యంలో ఇలా జరిగిందంటే మరింత పరువు తక్కువ.. పైగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆగిపోయే పరిస్థితి వస్తే ఇంకెంత అప్రదిష్ఠ..? అది కూడా ఆరేళ్లలో రెండోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తిందంటే ఏమనుకుంటారు..? ఎక్కడో ఆఫ్రికా దేశాల్లో అయితే, ఎవరూ పట్టించుకోరు..? కానీ, అమెరికాలో జరిగితే అందరూ నోరెళ్లబెడతారు..
రెండో గండం తప్పింది..
అమెరికాకు 2016-20 మధ్యన అధ్యక్షుడిగా పనిచేశారు డొనాల్డ్ ట్రంప్. ఆ సమయంలో 2018-19 మధ్య 35 రోజుల పాటు ప్రభుత్వం స్తంభించింది. దీనిని వారి భాషలో షట్ డౌన్ అని పిలుస్తారు. ఇది అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ షట్ డౌన్. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వచ్చింది. కానీ, త్రుటిలో గండం తప్పింది.
బిల్లు పాస్.. అందరూ రిలాక్స్..
అమెరికాలో షట్ డౌన్ గండం తప్పింది. ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించిన కీలక బిల్లుకు ఆ దేశఆ కాంగ్రెస్ ఆమోదం తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాబోయే అధ్యక్షుడు ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ చివరి నిమిషంలో ఆమోదించింది. దీనికి గడువు అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధ రాత్రి. అయితే, తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొనడంతో ఆలోగా ఆమోదం దక్కుతుందా? అని అందరూ ఉత్కంఠ ఎదుర్కొన్నారు. షట్ డౌన్ తప్పదని భావించారు. కానీ, ఇదే గడువుకు కొన్ని గంటల ముందు శుక్రవారం సాయంత్రం ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త ప్రణాళికకు సభ్యుల ఆమోద ముద్ర పడింది.
ట్రంప్ చెప్పినట్లు కాకుండా..
ప్రతినిధుల సభ బిల్లును ఆమోదించినా.. కాబోయే అధ్యక్షుడు ట్రంప్
లేవనెత్తిన డిమాండ్లను మాత్రం ఇందులో నుంచి తొలగించింది. ఇక ప్రతినిధుల సభ నుంచి బిల్లును సెనెట్ కు పంపగా అక్కడా ఆమోదం దక్కింది. తద్వారా అమెరికాకు షట్ డౌన్ ముప్పు తొలగింది.
ఇంతకూ ఏమిటీ బిల్లు?
ప్రభుత్వ కార్యకలాపాలు, జీతాలకు సంబంధించి ప్రభుత్వానికి నిధులు సమకూర్చేలా బైడెన్ ప్రభుత్వం బిల్లును తేగా.. ట్రంప్ తిరస్కరించారు. సమాఖ్య ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతోపాటు, వివిధ ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ బిల్లులో రెండేళ్ల పాటు రుణాలపై పరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రంప్ ప్రతిపాదనను చేరుస్తూ ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ గురువారం సరికొత్త బిల్లును సభలో పెట్టారు. కానీ, 235-174తో తిరస్కరించింది. ట్రంప్ పార్టీ (రిపబ్లికన్)కి చెందిన 38 మంది సభ్యులు డెమోక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం గమనార్హం. దీంతో షట్ డౌన్ తప్పదనే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ట్రంప్ కాస్త వెనక్కి తగ్గారు. బిల్లులో మార్పులు చేశారు. ట్రంప్ డిమాండ్లను తొలగించి సమాఖ్య కార్యకలాపాలకు నిధులు, విపత్తు సహకారం వంటి అంశాలతో 118 పేజీల మరో కొత్త ప్యాకేజీ బిల్లును స్పీకర్ ప్రవేశపెట్టారు. 366-34తో ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. మెజార్టీ రిపబ్లికన్లు అనుకూలంగా ఓటేశారు. ఇక సెనేట్ లో బైడెన్ పార్టీ అయిన డెమోక్రాట్ల సభ్యులే ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ 85-11తో ఆమోదం దక్కింది. ఇప్పుడు అధ్యక్షుడు బైడెన్ వద్దకు చేరింది ఫైలు. ఆయన సంతకం చేయడం ఒక్కటే మిగిలింది.