అమెరికాలో టిక్ టాక్ కు సరికొత్త సేవియర్ గా ట్రంప్!
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవిని మరోసారి చేపట్టాలని తపిస్తున్న ట్రంప్ సైతం ఇదే తీరును ప్రదర్శించటం ఇప్పుడు ఆసక్తికరంగామారింది.
దేశం ఏదైనా రాజకీయ నాయకులకు ఉన్న సౌలభ్యం ఏమంటే.. ఎప్పుడైనా వారు ప్లేట్ తిప్పేయొచ్చు. శాశ్విత శత్రువులు.. శాశ్విత మిత్రులు అంటూ ఎవరూ ఉండరు. ఎవరితోనైనా ఎప్పుడైనా చెట్టాపట్టాలు వేసుకోవచ్చు. లేదంటే.. తూచ్ అంటూ కత్తులు దూయొచ్చు. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవిని మరోసారి చేపట్టాలని తపిస్తున్న ట్రంప్ సైతం ఇదే తీరును ప్రదర్శించటం ఇప్పుడు ఆసక్తికరంగామారింది.
గతంలో తాను ప్రభుత్వాధినేతగా ఉన్నప్పుడు చైనాకు చెందిన టిక్ టాక్ మీద కత్తులే దూశారు. దాని అంతు చూసేందుకు చాలానే ప్రయత్నించారు. అధ్యక్షుడిగా ఆయన ణిషేధం కూడా విధించారు. అలాంటి ఆయన ఇప్పుడు టిక్ టాక్ మీద వల్లమాలిన ప్రేమను కురిపించటమే కాదు.. టిక్ టాక్ సేవియర్ గా కొత్త పాత్రను పోషించేందుకు తపిస్తున్నారు. ఒకప్పుడు అమెరికా భద్రతకు ముప్పుగా గగ్గోలు పెట్టిన ఆయన.. ఇప్పుడు దాన్ని కొమ్ము కాచేందుకు ఆసక్తిని చూపుతున్నారు. అంతేకాదు.. తనను అధ్యక్షుడిగా ఎన్నుకుంటే.. టిక్ టాక్ ను రక్షిస్తానని మాట ఇస్తున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
గతంలో ఆయన అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో టిక్ టాక్ చైనా యాప్ అని.. అదే మాత్రం సేఫ్ కాదని.. అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే వీలుందన్న అనుమానాల్ని ఆయన వ్యక్తం చేసేవారు. అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు తాను చెప్పిన విషయాన్ని ధ్రువీకరించినట్లు చెప్పేవారు. అందుకే.. టిక్ టాక్ ను అమెరికాలో బ్యాన్ చేస్తున్నట్లుగా 2020లో ప్రకటించిన పెద్దమనిషి.. ఇప్పుడు మాత్రం టిక్ టాక్ ను సేవ్ చేయటమే తన ప్రధమ కర్తవ్యంగా పేర్కొనటం గమనార్హం.
అమెరికాలో టిక్ టాక్ ను రక్షించాలని కోరుకునే వారంతా తనకు ఓటేయాలని ఆయన కోరుతున్నారు. కొద్ది నెలల క్రితం బైడెన్ సర్కారు ఒక బిల్లును తీసుకొచ్చింది. టిక్ టాక్ మాతృక సంస్థ అయిన బైట్ డాన్స్ కు ఒక అల్టిమేటం జారీ చేశారు. టిక్ టాక్ ను అమెరికాకు చెందిన కంపెనీకి అమ్మేయాలని. లేదంటే అమెరికాలో బ్యాన్ ఎదుర్కోవాల్సి ఉంటుందని అందులో పేర్కొనటం గమనార్హం. అయితే.. అమెరికా న్యాయస్థానంలో మాత్రం బైట్ డ్యాన్స్ కు ఊరట లభించింది.
ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటికి ప్రభుత్వ విభాగాల్లోనూ.. అమెరికా సైన్యంలోనూ టిక్ టాక్ యాప్ వాడకంపై బ్యాన్ ఉంది. అయితే.. అమెరికన్లలో ముఖ్యంగా యూత్ లో టిక్ టాక్ ను విపరీతమైన ఆదరణ ఉంది. దీన్ని గుర్తించిన ట్రంప్ తన మనసును మార్చుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక ఎగ్జిట్ పోల్స్ లో కేవలం 30 శాతం మంది మాత్రమే టిక్ టాక్ బ్యాన్ కు అనుకూలంగా ఓటేశారు. అందుకే.. టిక్ టాక్ కు అతి పెద్ద సేవియర్ అన్న వాదాన్ని అమెరికన్లలో తీసుకెళ్లేందుకు ట్రంప్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. మరి.. ఆయన కష్టం ఏమేర ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.