ట్రంప్.. నీది జాలి గుండె సామీ!
ఈ విషయంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.;
డొనాల్డ్ ట్రంప్.. ఎంత మొండిఘటమో అందరికీ తెలిసిందే. అనుకున్నాడంటే చేసి తీరుతాడు. ఎంత మంది తిట్టినా లెక్కచేయడు. అయితే అంత మొండి అయిన ట్రంప్.. తమ దేశం కోసం పాటుపడ్డ వారిని మాత్రం గుండెల్లో పెట్టుకుంటున్నాడు. తాజాగా అంతరిక్షంలో చిక్కుకుపోయి 9 నెలల తర్వాత తిరిగి వచ్చిన సునీత విలయమ్స్ కు తను నష్టపోయినవాటిని తిరిగి ఆర్థిక రూపంలోనైనా తిరిగి ఇచ్చేందుకు ట్రంప్ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆకట్టుకుంది ప్రభుత్వం నుంచి కాకుండా తన సొంత డబ్బులను సునీతకు ఇస్తానని ట్రంప్ పెద్ద మనసు చాటుకున్నాడు.
భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ , మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇటీవల అంతరిక్ష కేంద్రం (ISS) నుండి సురక్షితంగా భూమికి తిరిగి రావడం అందరికీ తెలిసిందే. వాస్తవానికి 8 రోజుల పర్యటన కోసం ISS కి వెళ్లిన వీరు, ఊహించని పరిస్థితుల కారణంగా దాదాపు 9 నెలల పాటు అక్కడే ఉండవలసి వచ్చింది. ఈ సుదీర్ఘ కాలం అంతరిక్షంలో గడిపినందుకు వారికి అదనపు వేతనాలు ఉంటాయా అనే విషయం చాలా మందికి ఆసక్తిని కలిగించింది.
ఈ విషయంపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. వారి ఓవర్‌టైమ్ జీతాన్ని తానే స్వయంగా చెల్లిస్తానని ఆయన ప్రకటించడం విశేషం. విలేకరులు సునీత , విల్మోర్‌లకు అదనపు వేతనం ఉంటుందా అని ప్రశ్నించగా ట్రంప్ బదులిస్తూ "నేను చేయాల్సి వస్తే, నా జేబు నుండి వారికి ఓవర్‌టైమ్ జీతం చెల్లిస్తాను. ఈ సందర్భంగా వ్యోమగాములను సురక్షితంగా భూమికి తీసుకురావడానికి సహాయం చేసిన ఎలాన్ మస్క్‌కు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆయన లేకపోతే ఏమయ్యేదో ఒకసారి ఆలోచించండి" అని అన్నారు.
అయితే వాస్తవానికి అంతరిక్షంలో నిర్ణీత సమయం కంటే ఎక్కువ కాలం పనిచేసిన వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని తెలుస్తోంది. నాసా నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. వ్యోమగాములు ఫెడరల్ ఉద్యోగులు కావడం వల్ల, వారు అంతరిక్షంలో పనిచేసిన కాలాన్ని భూమిపై సాధారణ పర్యటన చేసినట్లుగానే పరిగణిస్తారు. వారికి సాధారణంగా వచ్చే జీతంతో పాటు ISS లో వారి ఆహారం , బస ఖర్చులను నాసా భరిస్తుంది.
అయితే, ఇటువంటి ఊహించని పరిస్థితులు ఏర్పడినప్పుడు నాసా అదనంగా రోజుకు 5 డాలర్ల చొప్పున చెల్లిస్తుంది. దీని ప్రకారం సునీత - విల్మోర్ 286 రోజులు అంతరిక్షంలో ఉన్నందుకు గానూ వారికి అదనంగా 1,430 డాలర్ల చొప్పున చెల్లించనున్నారు.
నాసా ఉద్యోగులు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే జీతభత్యాలనే పొందుతారు. వ్యోమగాములకు జనరల్ షెడ్యూల్ GS-13 నుండి GS-15 కింద చెల్లింపులు ఉంటాయి. సునీతా విలియమ్స్ - బుచ్ విల్మోర్‌లు అత్యధిక గ్రేడ్ అయిన GS-15 గ్రేడ్ పే జీతం అందుకుంటున్నారు. దీని ప్రకారం గత ఏడాది వారి వార్షిక వేతనం 1,52,000 డాలర్లుగా ఉంది.
మొత్తానికి సునీత విలియమ్స్ -బుచ్ విల్మోర్ సురక్షితంగా తిరిగి రావడం అందరికీ గొప్ప ఊరటనిచ్చింది.. ట్రంప్ తానే జీతం ఇస్తానన్న వ్యాఖ్యలు ఈ అంశానికి మరింత ఆసక్తిని కలిగించాయి. అయితే నాసా నిబంధనల ప్రకారం వారికి ప్రత్యేకంగా ఓవర్‌టైమ్ వేతనం లేనప్పటికీ వారి సేవలకు తగిన గుర్తింపు వేతనం ట్రంప్ ఇస్తానని అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.