అమెరికా విదేశాంగ మంత్రి.. భారతీయుడు కాదు.. భారత అనుకూలుడు

ఇప్పుడు రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొత్త ఏడాదిలో కొలువుదీరనుంది.

Update: 2024-11-12 15:30 GMT

యుద్ధాలు.. ఉద్రిక్తతలతో కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాంగ మంత్రుల పాత్ర కీలకం. మరీ ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికా విదేశాంగ మంత్రి ఎవరా? అని కూడా చూస్తారు. ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది అనగానే.. అందరూ అధ్యక్షుడి తర్వాత అక్కడి మంత్రులు ఎవరా? అని చూస్తారు. అగ్ర రాజ్యం విధానాలను అర్థం చేసుకునేందుకు వారి నియామకాలు ఓ ఉదాహరణగా నిలుస్తాయి. ఇప్పుడు రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొత్త ఏడాదిలో కొలువుదీరనుంది.

మనోడికి చాన్స్ లేనట్లేనా..?

ట్రంప్ ఇంకో రెండు నెలల తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నప్పటికీ ఇప్పటినుంచే పాలకవర్గం కూర్పును వేగవంతం చేస్తున్నారు. అత్యంత కీలకమైన విదేశాంగ శాఖను ఎవరికి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు పలు పేర్లు వినిపిస్తున్నాయి. నిన్నటివరకు ప్రవాస భారతీయుడు వివేక్ రామస్వామిని విదేశాంగ మంత్రిని చేస్తారనే కథనాలు వచ్చాయి. ఎన్నికల్లో ట్రంప్‌ అభ్యర్థిత్వానికి ఓ దశలో వివేక్ పోటీదారుగా నిలిచారు. తర్వాత ట్రంప్ విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. కేవలం 38 ఏళ్ల వయసున్న వివేక్.. బయోటెక్‌ పారిశ్రామికవేత్త. ముక్కుసూటిగా మాట్లాడతారు. ఈ విధంగానే ట్రంప్‌ తరఫున ఇంటర్వ్యూల్లో వాదనలు వినిపించారు. దీంతో రామస్వామిని తన కార్యవర్గంలోకి తీసుకొంటానని ట్రంప్ ప్రకటించారు. అయితే, ఇప్పడు ట్రంప్‌ ప్రచార బృందంలో కీలక భూమిక వహించిన మరో నాయకుడు మార్కో రూబియోకు విదేశాంగ శాఖ దక్కే అవకాశం ఉందన్న కథనాలు వస్తున్నాయి.

మన మద్దుతుదారుడే..

భారతీయుడైన రామస్వామికి అవకాశం రాకున్నా.. అవకాశం దక్కుతున్న రూబియోకు భారత మద్దతుదారు అనే పేరుంది. ఆయన విదేశాంగ మంత్రి అయితే అమెరికా విధానంలో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఎందుకంటే భారత్‌ తో బంధాన్ని బలపరుచుకోవాలని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కీలక భాగస్వామిగా ఉండాలని గతంలో మాట్లాడారు. ఆయన హయాంలో రక్షణ, వాణిజ్య రంగాల్లో మరింత పురోగతి కనిపించే అవకాశం ఉంది.

చైనా బద్ద వ్యతిరేకి

రూబియో విషయంలో మరో ప్రత్యేకత ఏమంటే.. ఆయన చైనాను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ మానవ హక్కుల ఉల్లంఘనలు, వాణిజ్య పద్ధతులు, దక్షిణ చైనా సముద్రంలో అది చూపే దూకుడును తీవ్రంగా తప్పుబడుతుంటారు. సాంకేతికత బదిలీలపై ఆంక్షలు విధించాలంటారు. చైనాపై ఆర్థిక ఒత్తిడిని పెంచే విధానాలకు మద్దతు పలుకుతుంటారు. అంతేకాదు.. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాతో చర్చలకు పిలుపునిచ్చారు. అయితే నాటోకు కూడా గట్టి మద్దతుదారు. ఇజ్రాయిల్ ను అత్యంత కీలకమైన మిత్రదేశంగా చూస్తుంటారు. హమాస్ ను తుదముట్టించాలని పిలుపునిస్తుంటారు.

Tags:    

Similar News