ఉండవల్లి వైసీపీలోకి...ఈ ప్రచారంలో నిజమెంత ?

ఉండవల్లి అరుణ్ కుమార్. రాజకీయాల మీద ఆసక్తి అవగాహన ఉన్న వారికి ఈ పేరు పరిచయం ఉన్నదే.

Update: 2025-02-09 03:48 GMT

ఉండవల్లి అరుణ్ కుమార్. రాజకీయాల మీద ఆసక్తి అవగాహన ఉన్న వారికి ఈ పేరు పరిచయం ఉన్నదే. ఉండవల్లి రెండుసార్లు రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. ఆయన కాంగ్రెస్ అధినాయకత్వానికి సన్నిహితంగా ఉన్నారు. వైఎస్సార్ కి నీడగా తోడుగా దశాబ్దాల పాటు ఉన్న నాయకుడు. ఆయనకు ఆంతరంగికుడు.

అటువంటి ఉండవల్లి 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకించారు. ఆ తరువాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆయన రాజకీయాల నుంచి దూరం అయినా రాజకీయ విశ్లేషకుడిగా తన అభిప్రాయాలను ఎప్పటికపుడు వెల్లడిస్తూనే ఉంటారు. మీడియా ముందుకు వచ్చి ఉండవల్లి మాట్లాడారు అంటే వినే వారు చాలా మంది ఉంటారు. ఆయన ఏ విషయాల గురించి చెబుతారో ఎవరిని విమర్శిస్తారో అన్న చర్చ ఎపుడూ ఉంటూనే ఉంటుంది.

ఇదంతా ఎందుకు అంటే తాజాగా ఒక విషయం ప్రచారం అవుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరుతారు అని. ఆయన తొందరలోనే జగన్ పార్టీలోకి వస్తారని తనదైన రెండవ ఇన్నింగ్స్ ని అలా స్టార్ట్ చేస్తారు అని. దానికి ప్రాతిపదిక ఏమిటి అంటే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సాకే శైలజానాధ్ వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం.

అంతే కాదు ఆయన ఇంకా చాలా మంది కాంగ్రెస్ నాయకులు వైసీపీలో చేరుతారు అని చెప్పడంతో చాలా పేర్లు అయితే ప్రచారంలోకి వచ్చాయి. వారందరి సంగతి పక్కన పెడితే వైఎస్సార్ కి ఆంతరంగికుడిగా ఉన్న ఉండవల్లి వైసీపీకి అండగా ఉండేందుకు ఈ వైపునకు వస్తున్నారా అన్నదే చర్చగా ఉంది. ఉండవల్లి ఇపుడు రాజకీయంగా యాక్టివ్ గా లేరు. ఆయన వద్దు అనుకున్న రంగం కూడా ఇదే.

పైగా ఏడు పదుల వయసులో ఉన్న ఆయన ఇపుడు కొత్తగా వేరే రాజకీయ పార్టీలో చేరి ఏమి చేస్తారు అన్నది మరో చర్చ. ఉండవల్లి వైఖరి చూస్తే ఆయనది పూర్తిగా స్వతంత్ర్య స్వభావం. ఆయన తనకు తోచినది చేస్తారు. అలాగే ఉంటారు, అదే మాట్లాడుతారు. వైసీపీలో అయితే ఆయన ఉండగలరా ఇమడగలరా అన్నది ఒక చర్చ.

ఇక వైసీపీ అధినాయకత్వం తమ మాట వినే వారినే తీసుకుంటుందని అంటారు. అలా జరగని నాడు ఎంతటి బిగ్ షాట్ ని అయినా పక్కన తీసి పెడుతుందని కూడా చెబుతారు. మరి ఉండవల్లి వైసీపీ అంటే ఈ విషయాలు అన్నీ ఉంటాయి. అందుకే ఈ ప్రచారంలో నిజాలు ఎంత అన్నది చర్చకు వస్తోంది. ఉండవల్లి వైసీపీలో చేరడానికి కొన్ని కారణాలు ఉన్నాయని మరో ప్రచారం సాగుతోంది. దేశంలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోవాలని భావించే వారిలో ఉండవల్లి ఒకరు.

ఏపీలో చూస్తే కాంగ్రెస్ పుంజుకోవడం అన్నది ఇప్పట్లో జరగదు. అందువల్ల అదే భావజాలం ఉన్న వైసీపీ పుంజుకున్నా ఫ్యూచర్ లో కాంగ్రెస్ కి కలసి వస్తుందన్న ముందస్తు ఆలోచనలతో అయినా ఆయన వైసీపీకి మద్దతుగా ఉంటారు అన్నది ఒక చర్చ. అంతే కాదు తన ప్రియతమ నేస్తం వైఎస్సార్ కుమారుడు జగన్ ఎన్నడూ లేనంతగా కష్టాలలో ఉన్నారని అందువల్ల ఆయనకు ఈ కీలక సమయంలో అండగా నిలవాలని ఉండవల్లి భావిస్తున్నారు అన్నది కూడా ప్రచారమే. మరి ఇది నిజమవుతుందా లేదా అంటే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. అలాగని అన్నీ కూడా జరుగుతాయని అనుకోవడానికి లేదు. సో వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News