జనసేనతో పొత్తు వేళ... మరోసారి అమిత్ షా-ఎన్టీఆర్ భేటీ!?
అవును... జూనియర్ ఎన్టీఆర్ తో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమంత్రి అమిత్ షా మరోసారి భేటీ కానున్నారనే అంశం తెరపైకి వచ్చింది
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగు రాష్ట్రాల విషయంలో బీజేపీ నేతల వ్యూహాలు సరిగా అంతుపట్టడం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి! మరో పక్క టార్గెట్ తెలంగాణ ఎన్నికలా.. లేక.. వీటి మాటున ఏపీలో సరికొత్త వ్యూహాలా అన్న చర్చ కూడా ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో నందమూరి తారకరామారావు (జూనియర్ ఎన్టీఆర్) తో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమంత్రి అమిత్ షా మరోసారి భేటీ కానున్నారనే అంశం తెరపైకి వచ్చింది.
అవును... జూనియర్ ఎన్టీఆర్ తో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమంత్రి అమిత్ షా మరోసారి భేటీ కానున్నారనే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. త్వరలో తెలంగాణలో త్వరలో శాసన సభ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో అధికార బీఆరెస్స్, కాంగ్రెస్ లు దూకుడు మీదున్నాయి. ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సమయంలో బీజేపీ పొత్తులకు తెరతీసింది.
ఇందులో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు హైద్రాబాద్ లో పవన్ తో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. అనంతరం ప్రత్యేక విమానంలో కిషన్, పవన్ కలిసి హస్తినకు వెళ్లి అమిత్ షా భేటీ అయ్యారు! ఈ సమయంలో అమిత్ షా సీట్ల సర్ధుబాట్ల విషయంలో ఒక క్లారిటీకి రమ్మని ఇద్దరు నేతలకూ సూచించినట్లు వార్తలొచ్చాయి. అయితే.. ఆ తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడినట్లు సమాచారం లేదు!
అయితే... పవన్ కల్యాణ్ సుమారు 30 సీట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారని, కనీసం 20 అయినా ఇవ్వాలని అంటున్నారని, అందులో ప్రధానంగా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు ఉండాలని పట్టుబడుతున్నారని అంటున్నారు. అయితే అన్ని సీట్ల విషయం కాసేపు పక్కనపెడితే... సిటీలోని రెండు సీట్ల విషయంలో మాత్రం బీజేపీ నేతలు ససేమిరా అంటున్నారని సమాచారం. దీంతో.. ఈ పొత్తు వ్యవహారం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉందని చెబుతున్నారు.
మరోపక్క ఏపీలో టీడీపీతో కలిసి ముందుకు ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్తున్నారు పవన్ కల్యాణ్. ఇందులో భాగంగా ఇప్పటికే ఉమ్మడి కార్యచరణకు సంబంధించిన భేటీలు, జిల్లాలవారిగా సమావేశాలు నడుస్తున్నాయి. ఈ సమయంలో నవంబర్ 1న ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటన అని ప్రకటించినా... అనంతరం పలు కారణాలతో ఆ విషయం సైడ్ అయిపోయింది! ఆ మేనిఫెస్టో అంశం ప్రకటన మరళా ఎప్పుడనేది ఇంకా స్పష్టం కాలేదు.
మరోపక్క టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎప్పుడో సైడ్ చేసేశారని ఆయన ఫ్యాన్ ఫైరవుతూనే ఉన్నారు! వారి వారి అభిప్రాయాలను అప్పుడప్పుడూ ఊర్లలో ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. మరోపక్క స్కిల్ డేవలప్ మెంట్ స్కాం కేసులో బాబు అరెస్ట్ ను జూనియర్ ఖండించలేదని టీడీపీ నేతలు ఓ పులుపెక్కిపోయారనే కామెంట్లూ వినిపించాయి. దీనిపై "డోంట్ కేర్" అని రియాక్షన్లూ వచ్చాయి. ఈ నేపథ్యంలో... జూనియర్ – అమిత్ షా భేటీ అనే అంశం తెరపైకి వచ్చింది.
వీరిద్దరూ త్వరలో మరోసారి భేటీ కాబోతున్నారని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఈ భేటీ కావడంతో రాజకీయంగా తీవ్ర ప్రాధన్యత సంతరించుకోనుందనే చర్చ నడుస్తుంది. రెగ్యులర్ సమయాల్లో జరిగే భేటీకీ... ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న భేటీకీ చాలా వ్యత్యాసం ఉందనేది పరిశీలకుల మాటగా ఉంది. మరి వీరి భేటీ ఎప్పుడు ఉండనుంది.. ఆ భేటీలో ఏయే అంశాలపై చర్చ జరగనుంది అనేది వేచి చూడాలి.
కాగా... గతేడాది ఆగస్టులో టాలీవుడ్ జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయిన సంగతి తెలిసిందే. నాడు తెలంగాణలో తన ఒక్కరోజు పర్యటనలో భాగంగా... తారక్ ని కలుసుకున్న అమిత్ షా ఆర్‌ఆర్‌ఆర్ టీంకి అభినందనలు తెలిపారు. నాడు కూడా ఉప ఎన్నికలకు ముందు మునుగోడులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించేందుకు వచ్చిన సమయంలో ఈ సమావేశం జరగడంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.