అమెరికా అధ్యక్షుడి సౌకర్యాలు, సదుపాయాలు, జీతభత్యాల గురించి తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా ఉన్న అమెరికా అధ్యక్ష ఎనికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే!
ప్రపంచవ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా ఉన్న అమెరికా అధ్యక్ష ఎనికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే! ఈ ఎన్నికల్లో సూపర్ డూపర్ విక్టరీ సాధించిన ట్రంప్.. త్వరలో అగ్రరాజ్య అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సమయంలో... అమెరికా ప్రెసిడెంట్ కు ఉండే సౌకర్యాలు, సదుపాయాలు, వేతనం, ఇతర ఇన్ సెంటివ్స్, ప్రత్యేక వాహనాల గురించి తెలుసుకుందాం...!
అవును... అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై క్లారిటీ వచ్చేసింది. ఈ సందర్భంగా అమెరికా 57వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సమయంలో సకల సౌకర్యాలతో కూడిన వైట్ హౌస్ లో ఉండే అమెరికా ప్రెసిడెంట్ కు 24/7 ఈగ కూడా వాలకుండా చూసుకునే భద్రత మధ్య నివాసం ఉంటారు.
అగ్రరాజ్య అధినేత నివాసం:
అమెరికా అధ్యక్షుడు అనగానే గుర్తొచ్చేది ముందుగా వైట్ హౌస్ అనే సంగతి తెలిసిందే. ఆరు అంతస్తుల ఈ భవనాన్ని 1800లోనే నిర్మించారు. 55 వేల చదరపు అడుగులు కలిగిన ఈ శ్వేతసౌధంలో 132 గదులు, 35 బాత్ రూమ్ లతో పాటు ఇందులోనే జాగింగ్ ట్రాక్, మూవీ థియేటర్, టెన్నీస్ కోర్టు, స్విమ్మింగ్ పూల్ వంటివీ ఉంటాయి.
ఎయిర్ ఫోర్స్ వన్ – మెరైన్ వన్:
అమెరిక అధ్యక్షుడు ప్రయాణించడానికి ఓ ప్రత్యేక విమానాన్ని అందుబాటులో ఉంచుతారు. ఇదే... ఎయిర్ ఫోర్స్ వన్ విమానం. ఇందులో సకల సౌకర్యాలు ఉంటాయి. ఈ విమానం గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకొనే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ విమానంలో దాదాపు సకల సౌకర్యాలు ఉంటాయి. అందుకే దీన్ని.. ఎగిరే వైట్ హౌస్ అని పిలుస్తారు.
మెరైన్ వన్:
అమెరికా అధ్యక్షుడు స్థానికంగా ప్రయాణించడానికి ఉన్న హెలీకాప్టర్ పేరు మెరైన్ వన్! గంటకు సుమరు 241 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ హెలీకాప్టర్.. భారీ పేలుళ్లను తట్టుకోగలదు. ఇందులో ఉన్న మూడు ఇంజిన్ లలో ఒకటి ఫెయిల్ అయినా ఎగరగలదు. ఇలాంటివి ఒకేలా ఉండే ఐదు హెలీకాప్టర్లు ఉంటాయి. అధ్యక్షుడు ఎందులో ప్రయాణిస్తున్నాడో శత్రువులకు తెలియకుండా ఇలా ప్లాన్ చేశారు!
బీస్ట్:
అధునాతన ఫీచర్లు, భారీ భద్రతా ప్రమాణాలతో తయారు చేయబడి.. అమెరికా అధ్యక్షుడి ప్రయాణానికి వినియోగించే కారునే "బీస్ట్" గా వ్యవహరిస్తారు. అధ్యక్షుడు ఏ దేశానికి వెళ్లినా ఆయనతో పాటు బీస్ట్ ని కూడా తీసుకెళ్తారు. భద్రత విషయంలో ఈ కారుని కొట్టేది లేదని అంటారు.
జీతభత్యాలు!:
అమెరికా ప్రెసిడెంట్ వార్షిక వేతనం 4 లక్షల డాలర్లు. అంటే... ఏడాదికి రూ.3.3 కోట్లు అన్నమాట. ఇక ప్రెసిడెంట్ రిటైర్ అయాక వార్షికంగా 2 లక్షల డాలర్లు లభిస్తుంది. వీటితో పాటు ఒక లక్ష డాలర్లు అలవెన్సుల రూపంలో లభిస్తుంది. వీటితో పాటు ప్రయాణ ఖర్చులకు మరో లక్ష డాలర్లు, వినోదం కోసం మరో 19 వేల డాలర్లు అందుతుంది. అధికారిక, వ్యక్తిగత ఖర్చుల కోసం ఏటా 50 వేల డాలర్లు ట్యాక్స్ ఫ్రీ శాలరీ అందుతుంది.