ఆస్తుల ఇష్యూలో ఎంవోయూ ఆలోచన ఎవరిది? క్లారిటీ ఇచ్చిన విజయమ్మ

అదే సమయంలో ఎంవోయూ ఆలోచన ఎవరిదన్న విషయాన్ని విజయమ్మ చెప్పుకొచ్చారు.

Update: 2024-10-30 06:25 GMT

ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో వైఎస్ కుటుంబంలో నెలకొన్న తాజా పరిణామాలు షాకింగ్ గా మారటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చకు తెర తీస్తున్నాయి. ఈ మొత్తం ఎపిసోడ్ లో పదే పదే వినిపిస్తున్న మాట ఎంవోయూ. జగన్.. షర్మిల మధ్య చేసుకున్న ఎంవోయూ ప్రకారం తనకురావాల్సిన ఆస్తి ఇవ్వాలన్నది షర్మిల మాట అయితే.. ఎంవోయూ ప్రస్తావన చేస్తూనే.. తాజా పరిణామాల నేపథ్యంలో ఆ విషయంలో తాను మనసు మార్చుకున్నట్లుగా జగన్ తన వాదనను వినిపిస్తున్నారు.

ఇంతకూ ఆస్తులకు సంబంధించి ఎంవోయూ రాసుకోవాలన్న ఆలోచన ఎవరిది? ఏ సందర్భంలో వచ్చింది? అసలు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? అన్న ప్రశ్నలు ప్రాథమికంగా వస్తున్నాయి. వీటికి సమాధానం వెతికినప్పుడు ఆసక్తికర కోణాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు ఈ ప్రశ్నలకు సమాధానం లభించింది లేదు. షర్మిలపై వైవీ సుబ్బారెడ్డి.. విజయసాయి రెడ్డిలుప్రెస్ మీట్ పెట్టి మరీ విమర్శల వర్షం కురిపించిన నేపథ్యంలో విజయమ్మ రంగంలోకి దిగి.. వారిద్దరి వాదనలు తప్పు అని తేల్చటంతో పాటు.. వైఎస్ కుటుంబంలో జరిగిన పలు పరిణామాల్ని వరుస క్రమంలో చెప్పటం.. దీనికి సంబంధించి విడుదల చేసిన లేఖ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అదే సమయంలో ఎంవోయూ ఆలోచన ఎవరిదన్న విషయాన్ని విజయమ్మ చెప్పుకొచ్చారు. ‘‘పిల్లలు పెద్దవాళ్లయ్యారు. నాకూ అల్లుళ్లు వస్తారు. నీకూ ఆల్లుడు.. కోడలూ వస్తారు. మనం కలిసి ఉన్నట్లు.. వాళ్లు కలిసి ఉండకపోవచ్చు. కాబట్టి విడిపోదామని 2019లో ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకు ఇజ్రాయెల్ పర్యటనలో జగన్ షర్మిలతో అన్నారు. అప్పటివరకుకలిసి ఉన్న కుటుంబం ఆస్తుల పరంగా విడిపోవాలని నిర్ణయించాం’’ అని పేర్కొనటం ద్వారా ఎంవోయూకు ఇజ్రాయెల్ లో బీజం పడిందన్న విషయం స్పష్టమవుతుంది.

ఇక.. ఆస్తుల వాటాకు సంబంధించి కూడా క్లారిటీగా మాట్లాడుకున్నారన్న వాదనను విజయమ్మ వినిపిస్తున్నారు. ‘రాజశేఖర్ రెడ్డి మన మధ్య నుంచి వెళ్లిపోయాక 2009 నుంచి 2019 వరకు పదేళ్లు.. జగన్.. షఱ్మిల కలిసే ఉన్నారు. డివిడెండ్ రూపంలో జగన్ వాటా తీసుకొని రూ.200 కోట్లు పాప వాటాగా ఇచ్చారు. ఎంవోయూ ప్రకారంజగన్ కు 60 శాతం.. పాపకు 40 శాతం. ఎంవోయూకు ముందు చెరి సగం డివిడెండ్ తీసుకునేవారు. ఎందుకుంటే పాపకు సమాన వాటా ఉంది కాబట్టే. వీటన్నింటికీ అప్పుడూ ఇప్పుడూ నేనే సాక్షిని’’ అని క్లారిటీగా చెప్పేశారు. షర్మిలకు హక్కు ఉంది కాబట్టే ఎంవోయూ అధికారికంగా రాసుకున్నారన్న విజయమ్మ.. ‘‘ఎంవోయూలో పాపకు ఇవ్వాల్సిన ఆస్తులు జగన్ బహుమతిగా ఇస్తున్నవి కాదు. బాధ్యతగా ఇస్తున్నవి’’ అంటూ పేర్కొన్నారు. తాజా లేఖలో జగన్.. షర్మిల మధ్య ఆస్తుల ఎంవోయూ ఎందుకు జరిగిందన్న బ్యాక్ గ్రౌండ్ క్లారిటీ ఇచ్చారని చెప్పాలి.

Tags:    

Similar News