రూ. 83,67,67,65,705 యజమాని... ఏమి చేయాలో తోచడం లేదంట!
‘లూమ్’ సహ వ్యవస్థాపకుడు వినయ్ హిరేమత్ అకస్మాత్తుగా ధనవంతుడైన తర్వాత తన భావాలను వివరిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ రాశాడు.
ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు తన స్టార్టప్ ను విక్రయించడం ద్వారా మిలియన్ల డబ్బును పొందాడు. అయితే.. ఈ విధంగా అత్యంత ధనవంతుడు అయిన సదరు వ్యక్తి.. ఇప్పుడు తనకు ఏమి చేయాలో తోచడం లేదు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు ఆసక్తికరంగా మారింది. ఏమిటా పోస్టు.. ఎవరా రిచ్చెస్ట్ మ్యాన్ అనేది ఇప్పుడు చూద్దాం...!
అవును... ‘లూమ్’ సహ వ్యవస్థాపకుడు వినయ్ హిరేమత్ అకస్మాత్తుగా ధనవంతుడైన తర్వాత తన భావాలను వివరిస్తూ సుదీర్ఘమైన పోస్ట్ రాశాడు. భారతీయ సంతతికి చెందిన వ్యాపార వేత్త అయిన వినయ్ హీరేమత్ 2023లో తన స్టార్టప్ ను $975 మిలియన్లకు (రూ. 83,67,67,65,705) ఆస్ట్రేలియాలోని సాఫ్ట్ వేర్ కంపెనీకి అమ్మేశాడు.
అయితే.. ఇంత ధనవంతుడు అయిన తర్వాత నుంచి ఏమి చేయాలో తెలియడం లేదంటు ఓ పోస్ట్ రాశాడు. ఇకపై డబ్బు సంపాదించడం కోసం పని చేయాల్సిన అవసరం లేదని తెలుసుకున్న తర్వాత తన జీవితంలో చేయడానికి ప్రయత్నించిన ప్రతీ దాన్ని వివరించే ప్రయత్నం చేశాడు.
ఇందులో భాగంగా... తాను కంపెనీని విక్రయించిన తర్వాత మళ్లీ పనిచేయాల్సిన అవసరం లేని పూర్తిగా అన్ రిలేబుల్ పొజిషన్ లో ఉన్నానని.. ఈ సమయంలో ప్రతీదీ ఒకవైపు అన్వేషణలా అనిపిస్తుంది కానీ స్ఫూర్తిదాయకంగా లేదని.. తనకు అనంతమైన స్వేచ్ఛ ఉన్నప్పటికీ.. ఏమి చేయాలో మాత్రం తెలియడం లేదని చెప్పుకొచ్చాడు.
అయితే... ఈ పోస్ట్ ఉద్దేశ్యం గొప్పలు చెప్పుకోవడమో.. లేదా, సానుభూతి పొందడమో కాదని అన్నాడు. ఇదే సమయంలో హీరేమత్.. తన ప్రియురాలితో విడిపోవడంపైనా స్పందించాడు. వారి సంబంధాన్ని ‘షరతులు లేని ప్రేమ’గా పిలిస్తూ.. విడిపోవడం మాత్రం ‘వర్ణించలేని వేదన’గా అభివర్ణించాడు.
ఈ సందర్భంగా... ఈ నోట్ ను ఆమె చదువుతుంటే గనుక... ‘థాంక్స్ ఫర్ ఎవ్రితింగ్ అండ్ సారీ’ అని తెలిపాడు. ఈ సమయంలో... అతను ఎలాంటి ముందస్తు అనుభవం లేకుండా హిమాలయాల్లో ట్రెక్కింగ్ ను ప్రారంభించినట్లు తెలిపాడు.. అయితే అనారోగ్యానికి గురి కావడంతో మధ్యలోనే ఆపేసినట్లు వెల్లడించాడు.
అనంతరం కాస్త కోలుకున్న తర్వాత.. తన స్నేహితులు అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) లో ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిని సంప్రదించమని ప్రోత్సహించారని.. ఈ క్రమంలో వారితో కొన్ని రోజులు పనిచేసినట్లు తెలిపాడు. ఈ క్రమంలో అది తనకు సూట్ కాదని గ్రహించి.. డోజ్ నుంచి బయటకు వచ్చేసినట్లు వెల్లడించాడు.
ప్రస్తుతం 33 ఏళ్ల హీరేమత్.. ప్రత్యక్షమైన, వాస్తవ-ప్రపంచ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీని ప్రారంభించాలనే లక్ష్యంతో ఫిజిక్స్ చదువుతున్నట్లు తెలిపాడు.