బీఆర్ఎస్ భవిష్యత్ ఏంటి.. మహారాష్ట్ర బరిలో నిలిచేనా..?
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఓ సంచలనం. 2001 ఏప్రిల్ 27న పలువురు తెలంగాణవాదులతో కలిసి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ప్రకటించారు. టీడీపీకి రాజీనామా ప్రకటించిన కేసీఆర్.. పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.
ఆ వెంటనే కొద్ది రోజులకు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. మొదటి సారి ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. పలు స్థానాల్లో గెలుపొందింది. ఇదే క్రమంలో నిత్యం ప్రజల్లోకి వెళ్తూ.. రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత, అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. మరోవైపు రాజకీయంగానూ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీతో 2004లో జతకట్టింది. ఈ ఎన్నికల్లో ఏకంగా 42 స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేసింది. ఏకంగా 26 స్థానాల్లో విజయం సాధించింది. ఆరు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయగా.. ఐటింటా విజయబావుటా ఎగురవేసింది. అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మొండిచేయి చూపడంతో కేసీఆర్ ఉప ఎన్నికలకు వెళ్లారు. గతంలో కంటే కొన్ని స్థానాలను కోల్పోయారు. దాంతో 2009లో మహాకూటమితో జతకట్టారు. టీడీపీతోపాటు కమ్యూనిస్టులతో కలిశారు. ఈ ఎన్నికల్లో విఫలం కావడంతో ఒకానొక సందర్భంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ఆ తర్వాత కేసీఆర్ దీక్షతో పార్టీకి మళ్లీ ఊపువచ్చింది.
ఎన్నో ఉద్యమాలు.. ఎన్నో దీక్షలు చేపట్టిన తరువాత ఎట్టకేలకు తెలంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైంది. అదే ఏడాది 2014లో ఎన్నికలు కూడా వచ్చాయి. ఇందులో ఒంటరిగానే బరిలోకి దిగిన గులాబీ పార్టీ బంపర్ విజయం సాధించింది. మొదటి నుంచి ఉద్యమాన్ని భుజాన మోసిన టీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కట్టారు. ఆ తదుపరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అందులోనూ కేసీఆర్ తిరుగులేని విజయం సాధించారు. గతంలో కంటే మరిన్ని మెజార్టీ స్థానాలను పార్టీ కైవసం చేసుకుంది. రెండో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పీఠం ఎక్కారు.
అయితే..రెండో పర్యాయంలో నాలుగేళ్లు పూర్తి చేసుకుంటున్న క్రమంలో కేసీఆర్ దృష్టి జాతీయ రాజకీయాలపై పడింది. నిత్యం దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌యేతర ఫ్రంట్ అంటూ తిరిగారు. దేశంలోని ప్రాంతీయ పార్టీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ సభల్లో పాల్గొన్న సందర్భంలో జాతీయ రాజకీయాల్లోకి పోదామా అంటూ ప్రజలతో నినాదాలు చేపించారు. అలాగే కేంద్రంలోని మోడీ విధానాలను నిత్యం తప్పుపడుతూ వచ్చారు. అదే ఏడాదిలో టీఆర్ఎస్‌ను కాస్త బీఆర్ఎస్‌గా ప్రకటించారు. భారతీయ రాష్ట్ర సమితి పార్టీగా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు అనౌన్స్ చేశారు.
ఆ తరువాత మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది నాయకులు వచ్చి స్వచ్ఛందంగా చేరారు. దాంతో కేసీఆర్ మహారాష్ట్రపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. నాందేడ్‌లో పార్టీ ఆఫీసును ప్రారంభించారు. అదే క్రమంలో అక్కడ జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ పోటీ చేసి పార్టీ సత్తాచాటారు. నాగ్‌పూర్ డివిజన్‌లోని భండారా జిల్లాలో 20, విదర్భ, షోలాపూర్‌లోని 15 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. అలాగే.. భారీ ఎత్తున సభ్యత్వాలు కూడా నమోదు చేయించింది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 20 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదయ్యాయి. గ్రామస్థాయిలోనూ పార్టీ నిర్మాణం చేపట్టినట్లు సమాచారం.
అయితే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఆ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో అప్పటి నుంచి కేసీఆర్ ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు. రోజురోజుకూ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. చాలా మంది క్యాడర్ పార్టీని వీడి వెళ్లిపోయారు. దాంతో మహారాష్ట్ర బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రైతు సంఘం నేత మానిక్‌రావు కదం, మహారాష్ట్ర బీడ్ జిల్లా ఇన్చార్జిగా పనిచేస్తున్న దిలీప్ గోరే రాజీనామా చేసేశారు. వీరితోపాటే పలువురు పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు.
ఇదిలా ఉండగా.. నిన్న మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం షెడ్యూల్ రిలీజ్ అయింది. నవంబరులో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్‌పై పడింది. గతంలో చెప్పిన విధంగా మహారాష్ట్రకు వెళ్లి అక్కడ పోటీచేస్తారా..? ఇక్కడ అధికారం కోల్పోయాం కదా అని ఎప్పటిలాగే ఫాంహౌజ్‌కే పరిమితం అవుతారా..? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. క్యాడర్‌లోనూ అసలు పార్టీ పరిస్థితి ఏంటా అన్న సందేహాలూ వినిపిస్తున్నాయి.