సిట్టింగులు చేజారినా బేఫిక‌ర్‌.. కేసీఆర్ వ్యూహ‌మేంటి?

ఎందుకంటే.. వీరివ‌ల్ల ఎన్నిక‌ల్లో ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే.. చిత్రంగా అధికార పార్టీ బీఆర్ ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేజారుతున్నా.. కేసీఆర్ మౌనంగా ఉన్నారు.

Update: 2023-10-21 02:45 GMT

తెలంగాణ‌లో కీల‌క‌మైన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యం. ప్ర‌తి ఓటూ ఎంత కీల‌క‌మో.. పార్టీల‌కు ప్ర‌తినాయ‌కుడూ అంతే కీల‌కం. అందుకే.. బుజ్జ‌గించో బ్ర‌తిమాలో.. నాయ‌కుల‌ను నిలుపుకొనేందుకు, నిల‌బెట్టుకునేందుకు పార్టీలు, అధినేత‌లు ప్ర‌య‌త్నిస్తారు. అంతేకాదు.. వారికి కొన్ని తాయిలాలు కూడా ప్ర‌క‌టిస్తారు. చోటా మోటా నాయ‌కులు పోతే ఫ‌ర్లేదు కానీ.. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే స్థాయి నాయ‌కులైతే.. పార్టీలు చేజార్చుకునేందుకు అంగీక‌రించ‌వు. ఎందుకంటే.. వీరివ‌ల్ల ఎన్నిక‌ల్లో ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే.. చిత్రంగా అధికార పార్టీ బీఆర్ ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేజారుతున్నా.. కేసీఆర్ మౌనంగా ఉన్నారు.

ఇప్ప‌టికి దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు బీఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు.. రెడీ అయ్యారు. వీరంతా సిట్టింగ్ ఎమ్మెల్యే. వారిలో ఒక‌రిద్ద‌రితో కేసీఆర్ చ‌ర్చ‌లు జ‌రిపినా.. అవి ఫ‌లించ‌క‌పోవ‌డంతో మౌనంగా ఉన్నారు. మ‌రి మిగిలిన వారి సంగ‌తి? ఏంటి? అంటే.. అస‌లు వారిని ప‌ట్టించుకోవ‌డ‌మే లేదు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్ర‌హంకు టికెట్ ఇవ్వ‌లేదు. కానీ, ఆయ‌న పేరును మాత్రం లిస్టులో పేర్కొన్నారు. దీంతో విష‌యం మాట్లాడేందుకు వ‌చ్చిన ఆయ‌న‌తో క‌నీసం కేసీఆర్, కేటీఆర్ కానీ, హ‌రీష్ రావు కానీ మాట్లాడ‌లేదు.

ఇక‌, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయ‌క్ ప‌రిస్థితి కూడా ఇలానే ఉంది. ఆయ‌న‌ను కూడా జాబితాలో పేర్కొన్న కేసీఆర్.. అనూహ్యంగా బీఫాం విష‌యానికి వ‌చ్చేస‌రికి త‌ప్పించారు. ఆయ‌న పేరు, ఊరు కూడా ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. దీంతో ఆయ‌న కూడా త‌న దారి తాను చూసుకుంటున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అయ్యారు. ఇక‌, బోద్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు కూడా ఇదే బాట ప‌ట్టారు. ఈయ‌న చాలా రోజులు కేసీఆర్ క‌రుణ కోసం వేచి చూశారు. కానీ, ఎలాంటి గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ పార్టీలో సీటును సుస్థిరం చేసుకున్న‌ట్టు తెలిసింది.

ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు ఇలా ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి దూర‌మైనా కేసీఆర్ బేఫిక‌ర్ అన్న‌ట్టుగా ఉన్నారు. కానీ, వెళ్లిపోతున్న ఎమ్మెల్యేల సామాజిక వ‌ర్గాలు, వారికిస్థానికంగా ఉన్న గుర్తింపును ప‌రిశీలిస్తే.. బీఆర్ ఎస్‌కు ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోనే కాకుండా.. సామాజిక వ‌ర్గాల్లోనూ ఎదురు దెబ్బ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఎంత లేద‌న్నా.. ఎస్సీ, ఎస్టీల విష‌యంలో కేసీఆర్ మ‌రోసారి ఆలోచించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌నే చ‌ర్చ సాగుతోంది. కానీ, కేసీఆర్ మాత్రం తాను తెప్పించుకున్న స‌ర్వేల‌నో.. లేదా.. త‌న వారినో న‌మ్ముతున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. చివ‌ర‌కు ఏం జ‌రుగుతుందో చూడాలి.

Tags:    

Similar News