క‌మ‌లంలో కుంప‌ట్లు.. అభ్య‌ర్థుల రాజీనామాలు రీజ‌నేంటి?!

ఇక‌, పటాన్‌చెరు టికెట్‌ను నందీశ్వర్ గౌడ్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న 8 మంది మండల, డివిజన్ బీజేపీ అధ్యక్షులు.. పటాన్‌చెరు అభ్యర్థిపై పునరాలోచన చేసుకోవాలని పార్టీ నాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

Update: 2023-10-24 00:30 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఎన్ని సీట్ల‌లో గెలుస్తుందో తెలియదు. అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు గంభీర ప్ర‌క‌ట‌న‌లు చేసిన వారు కూడా ఇప్పుడు గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానాలు ద‌క్కితే అదే చాలు.. ప‌ది వేలు అనుకుంటున్నారు. అలాంటి పార్టీలో ఇప్పుడు త‌మ‌కు టికెట్ ద‌క్క‌లేదంటూ.. ప‌లువురు నాయ‌కులు.. అసంతృప్తి వ్య‌క్తం చేస్తూ.. పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. ఈ ప‌రిణామం రాష్ట్ర బీజేపీ నాయ‌కత్వానికి శ‌రాఘాతంగా మారింది.

తాజాగా తెలంగాణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ అధినాయ‌క‌త్వం తొలి జాబితా ప్ర‌క‌టించింది. అయితే.. దీనిలో త‌మ‌కు చోటు ఖ‌చ్చితంగా ద‌క్కుతుంద‌ని భావించిన వారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీ కోసం ప‌నిచేసిన మ‌హిళా నాయ‌కులు కూడా ఉన్నారు. అయితే, ఏం జ‌రిగిందో ఏమో .. అస‌లు వీరిని పార్టీ ప‌రిగ‌ణ‌న‌లోకి కూడా తీసుకోలేదు. దీంతో వీరు ల‌బోదిబో మంటూ.. పార్టీ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ముథోల్ టికెట్ దక్కకపోవటంతో నిర్మల్ జిల్లా‌ బీజేపీ అధ్యక్ష పదవికి రమాదేవి రాజీనామా చేశారు. కన్న తల్లి లాంటి పార్టీ తనకు అన్యాయం చేసిందని బోరున విలపించారు. త్వ‌ర‌లోనే తన రాజ‌కీయ భ‌విష్య‌త్తుపై నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. ర‌మాదేవిని పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ నాయకులు త‌మ వారిని రంగంలోకి దింపాయి. స్థానికంగా ర‌మావేవి ప్ర‌భావం ఎక్కువ‌గానే ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇక‌, పటాన్‌చెరు టికెట్‌ను నందీశ్వర్ గౌడ్‌కు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న 8 మంది మండల, డివిజన్ బీజేపీ అధ్యక్షులు.. పటాన్‌చెరు అభ్యర్థిపై పునరాలోచన చేసుకోవాలని పార్టీ నాయకత్వానికి అల్టిమేటం జారీ చేశారు. దీనిపై త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకోక‌పోతే.. పార్టీ నుంచి వెళ్లిపోతామ‌ని వారు హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

అదేవిధంగా బీజేపీ సీనియర్ నేత, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తన పేరు మెదట లిస్టులో లేకపోవడంతో తీవ్ర‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డిని కలసి తన ఆవేదనను వ్యక్తపరిచారు. పార్టీలో ఉండాలో వ‌ద్దో చెప్పాల‌ని నిల‌దీసిన‌ట్టు ఆయ‌న అనుచ‌రులు పేర్కొంటున్నారు. మరోవైపు బీజేపీ అభివృద్ధికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి కూడా త‌న‌కు ప్రాధాన్యం ద‌క్క‌లేద‌ని చెబుతూ.. పార్టీకి రాజీనామా చేశారు. మొత్తానికి మొద‌టి జాబితాలోనే బీజేపీలో సెగ‌లు పొగ‌లు బ‌య‌ట‌ప‌డ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

Tags:    

Similar News