విశాఖలో మోడీ ఆ క్లారిటీ ఇవ్వాల్సిందేనా ?
జనవరి 8న అనకాపల్లిలో ప్రధాని అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు అని చెబుతున్నారు.
ప్రధానమంత్రిగా మూడో పర్యాయం ప్రమాణం చేసిన తరువాత నరేంద్ర మోడీ విశాఖ జిల్లా పర్యటనకు వస్తున్నారు. కొత్త ఏడాది మొదలవుతూనే ఆయన విశాఖ టూర్ పెట్టుకున్నారు. జనవరి 8న అనకాపల్లిలో ప్రధాని అనేక అభివృద్ధి కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు అని చెబుతున్నారు. అనంతరం జరిగే బహిరంగసభలో కూడా మోడీ ప్రసంగిస్తారు అని తెలుస్తోంది.
అయితే మోడీ విశాఖ పర్యటన నేపధ్యంలో ఉక్కు కార్మిక సంఘాలు కూడా ఆయనకు తమ గోడుని చెప్పుకోవాలని చూస్తున్నాయి. గత నాలుగేళ్ళుగా విశాఖలో తాము నిర్వహిస్తున్న అలుపెరగని ఆందోళన గురించి తెలియచేస్తూ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కాకుండా కాపాడాలని కోరడానికి సిద్ధపడుతున్నాయి. ఇదిలా ఉంటే విశాఖ పర్యటనకు వచ్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధాని విశాఖలో పర్యటిస్తున్న నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే అని డిమాండ్ చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏళ్ళ తరబడి ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరం అని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని కాపాడాల్సిన అవసరం ఏపీలోని కూటమి ప్రభుత్వం మీద కూడా ఉందని ఆయన అన్నారు.
విశాఖ ఆర్థిక నగరంగా ఉంది అంటే దానికి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండడమే ప్రధాన కారణం అని ఆయన అన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంటూంటే ఏపీలోని ఎంపీలు కూడా నిలదీయడం లేదని అన్నారు. విశాఖలో ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ ఉండగా మళ్ళీ ప్రైవేట్ రంగంలో అదే జిల్లాలో మిట్టల్ వారి స్టీల్ ప్లాంట్ ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఇదంతా విశాఖ స్టీల్ ప్లాంట్ ని బలహీనం చేయడానికే అని అంటున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించబోమని స్పష్టంగా చెబితేనే తప్ప కార్మికులు ఆందోళన విరమించరని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది నవంబర్ లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించాల్సి ఉంది. అయితే అప్పట్లో వాతావరణ అనుకూలించకపోవడం వల్ల ఆయన పర్యటన రద్దు అయింది.
ఇపుడు చూస్తే మోడీ విశాఖ జిల్లాకు వస్తున్నారు. ఆయన స్టీల్ ప్లాంట్ గురించి ఏమి చెబుతారు అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్నికల సందర్భంలో కూడా మోడీ స్టీల్ ప్లాంట్ గురించి ఏమీ మాట్లాడలేదని అంటున్నారు. అందువల్ల ఆ ప్రస్తావన కానీ ఏమీ ఉండే చాన్స్ లేదని అంటున్నారు.
అదే కనుక జరిగితే స్టీల్ ప్లాంట్ కార్మికులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అన్నది కూడా చూడాల్సిందే. ఉక్కు ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిరసిస్తూ జనవరి 27న విశాఖలో లక్ష మంది కార్మికులతో పెద్ద బహిరంగ సభను విశాఖలో నిర్వహించేందుకు కూడా ప్రజా సంఘాలు చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని ఏదో ఒక విషయం మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.