నితీష్....ఎన్డీయే నుంచి తప్పుకోండి !

ఆయన ఎక్కడ తీగ లాగేస్తారో అన్నది ఏకంగా బీజేపీ పెద్దలకే డౌట్ ఉంది.

Update: 2024-10-11 17:30 GMT

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఆధారపడినదే బీహార్ లోని జేడీయూ మీద ఏపీలోని టీడీపీ మీద. అందులో తరచూ బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ మీదనే అందరి అనుమానపు చూపులు ఉంటున్నాయి. ఆయన ఎక్కడ తీగ లాగేస్తారో అన్నది ఏకంగా బీజేపీ పెద్దలకే డౌట్ ఉంది. బీజేపీ ఈ విషయంలో ఎప్పటికపుడు అలెర్ట్ అవుతూనే ఉంది.

కానీ ఎన్డీయే కూటమిలో మూడవ అతి పెద్ద పార్టీగా జేడీయూ ఉంది. ఆ పార్టీకి 12 మంది ఎంపీలు ఉన్నారు. లోక్ జనశక్తి పార్టీకి 5 ఎంపీలు, మాజీ సీఎం జితన్ రామ్ మాంఝీ తనకు తానుగా గెలుచుకున్న ఏకైక సీటు ఉంది. దాంతో 18 మంది ఎంపీలు బీహార్ లో ఎన్డీయే మిత్రులుగా ఉన్నారు అన్న మాట.

ఇందులో చిరాగ్ పాశ్వాన్ నితీష్ కుమార్ తో కలసి వెళ్లేది ఉండదు. అలాగే జితన్ రామ్ మాంఝీ కూడా నితీష్ కుమార్ ని వ్యతిరేకించి సొంత పార్టీని పెట్టారు. ఆ విధంగా ఆయన కూడా కలిసేది లేదు. దాంతో జేడీయూ 12 మంది ఎంపీలు మాత్రం ఎన్డీయే ప్రభుత్వానికి ఎప్పటికపుడు హెచ్చరికగానే ఉంటున్నారు.

ఈ సమయంలో ఇండియా కూటమిలో కీలక భాగస్వామి అయిన ఎస్పీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ నితీష్ కుమార్ ని ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చేయమని డిమాండ్ చేస్తున్నారు. నితీష్ బయటకు వస్తారని ఏదో నాటికి అది జరుగుతుందని ఇండియా కూటమి ఎపుడూ ఊహిస్తున్నదే. అయితే ఇపుడు ఏకంగా అఖిలేష్ బయటకు వచ్చేయ్ అంటూ డిమాండ్ చేయడంతో జాతీయ రాజకీయాల్లో ఇది కలకలం రేపుతోంది.

ఇంతకీ నితీష్ కుమార్ ఎందుకు బయటకు వచ్చేయాలి అన్నది చూస్తే లక్నోలో ఈ రోజు సోషలిస్ట్‌ నేత లోక్‌నాయక్‌ జయప్రకాష్‌ నారాయణ్‌ విగ్రహానికి పూలమాల వేయకుండా తనను బీజేపీ ప్రభుత్వం అడ్డుకున్నందున అఖిలేస్ధ్ యాదవ్ కి తీవ్రంగా కోపం వచ్చింది. జయ ప్రకాష్ నారాయణ్ విషయంలో ఇలా చేసి అవమానిస్తారా అని ఆయన మండిపడుతున్నారు

నిజానికి ఈ రోజు జయప్రకాష్ నారాయణ్ జయంతి. దీంతో ఆయనకు ఘనంగా నివాళి అర్పించాలని అఖిలేష్ అనుకున్నారు. ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్, అలాగే బీహార్ లోని లాలూ యాదవ్, నితీష్ కుమార్ సహా చాలా మంది జయప్రకాష్ నారాయణ్ శిష్యులే. ఆయన 1975లో అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడితే వీరంతా విద్యార్థి దశ నుంచే ఆయనను అనుసరించారు.

దాంతో ఇపుడు సోషలిస్టు నేత అయిన జయ ప్రకాష్ నారాయణ్ కి అవమానం జరుగుతోందని అఖిలేష్ అంటున్నారు. ఈ రోజున కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉంది అంటే చాలా మంది సోషలిస్ట్‌ నాయకుల మద్దతుతోనే అని ఆయన నితీష్ కుమార్ ని గుర్తు చేశారు

జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌ కూడా జయప్రకాష్‌ నారాయణ్‌ ఉద్యమం నుండి వచ్చారని కూడా అఖిలేష్ చెప్పడం విశేషం. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సోషలిస్టు పంధాను అనుసరించని ప్రభుత్వమని ఆయన ఘాటుగా విమర్శించారు.

అందువల్ల సోషలిస్ట్ భావాలు ఉన్న నితీష్‌ కుమార్‌ ఎండీ ఎన్డీయే నుంచి వైదొలిగేందుకు ఇదే మంచి అవకాశమని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. లోక్‌నాయక్‌ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేయకుండా బీజేపీ అడ్డుకుంది. అయినప్పటికీ ఆయనకు నివాళులు అర్పించామని ఆయన అన్నారు.

ఇక జయప్రకాష్‌ నారాయణ్‌ గౌరవార్థం నిర్మించిన విగ్రహాన్ని సైతం విక్రయించాలని బిజెపి ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన మరో ఆరోపణ చేశారు. ఎన్డీయే ప్రభుత్వం రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని ఆశించడం తప్పు అవుతుందని కూడా అన్నారు

మొత్తానికి అఖిలేష్ కోపం నితీష్ కి అవకాశంగా మారుతుందా అన్నది చూడాలి. నితీష్ కుమార్ ఎన్డీయే నుంచి బయటకు రావాలని చూస్తున్నారు అని ఇండియా కూటమి నేతలు అంటున్నారు. సోషలిస్టు నేత లోక్ నాయక్ ని అడ్డుపెట్టుకుని ఆయన బయటకు వస్తే అది సరైన రీజన్ అవుతుందని అంటున్నారు. మరి నితీష్ కుమార్ ఏమి చేస్తారు అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా నితీష్ ఇండియా కూటమి నీడ నుంచి తప్పించుకోలేకపోతున్నారు అనే చెప్పాలి.

Tags:    

Similar News