కేజ్రీకి చుక్కెదురు.. బయటకు కష్టమే.. మధ్యంతర బెయిల్ సుప్రీం నో

ఆ గడువు తీరిన వెంటనే తిరిగి తిహాడ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

Update: 2024-08-14 07:35 GMT

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర్వింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన ఇప్పట్లో జైలు నుంచి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మద్యం విధానం కేసులో మార్చి నెలలో అరెస్టయిన కేజ్రీ.. మధ్యలో రెండు వారాల పాటు బెయిల్ పై బయటకు వచ్చారు. అది కూడా లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం కావడం గమనార్హం. ఆ గడువు తీరిన వెంటనే తిరిగి తిహాడ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే, ఇది జరిగి రెండు నెలుల దాటింది. దీంతో కేజ్రీ మరోసారి బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఫలితం దక్కడం లేదు.

సీబీఐ కేసులో..

కేజ్రీవాల్ పై మద్యం విధానం కేసులో తొలుత ఈడీ తర్వాత సీబీఐ కేసులు నమోదు చేశాయి. ఇప్పుడు ఆయన బెయిల్ కోరింది సీబీఐ కేసులోనే.

తన అరెస్టుకు వ్యతిరేకంగా కేజ్రీ వేసిన పిటిషన్‌ పై సీబీఐకి నోటీసులిచ్చిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కాగా, కేజ్రీవాల్ ను జూన్‌ చివరలో సీబీఐ అరెస్టు చేసింది. ఆయన సీబీఐ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. తొలుత ఢిల్లీ హైకోర్టుకు వెళ్లగా అరెస్టు చట్టబద్ధమేనని తేల్చింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇక్కడా ఊరట లభించలేదు. మరోవైపు సుప్రీం తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది. కాగా, మొదటి కేసు అయిన ఈడీ కేసులో కేజ్రీవాల్ కు గత నెల 12నే మధ్యంతర బెయిల్ ఇచ్చింది. కానీ, సీబీఐ కేసులో అరెస్టు కారణంగా జైలు నుంచి విడుదల కాలేకపోయారు. వాస్తవానికి ఈడీ కేసులో బెయిల్ వస్తున్నదనే సీబీఐ జోక్యం చేసుకున్నదని ఆప్ ఆరోపణలు చేసింది. ఇప్పుడదే జరిగింది.

ఢిల్లీ మద్యం విధానం కేసులో అరెస్టయిన మాజీ ఉప ముఖ్యమంత్రి, కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడు అయిన మనీశ్ సిసోడియాకు గత వారం బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో తిహాడ్ జైలులో ఉన్న తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత కూడా బెయిల్ ప్రయత్నాల్లో ఉన్నారు. కవితకు ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ వర్గాలు ధీమాగా ఉన్నాయి.

Tags:    

Similar News