మహిళా రిజర్వేషన్ బిల్లుపై సుప్రీం కోర్టులో పిటిషన్

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ బిల్లుపై కాంగ్రెస్ నేత డాక్టర్ జయ ఠాకూర్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

Update: 2023-10-16 14:11 GMT

2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే . చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఆ బిల్లుకు రాష్ట్రపతి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్ట రూపం దాల్చింది. అయితే, రాబోయే ఎన్నికల్లో ఈ చట్టం అమలయ్యే అవకాశం లేదు. 2029 ఎన్నికలకు ముందు ఈ చట్టం ప్రకారం చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది.

జన గణన, నియోజకవర్గాల పునరవిభజన వంటి అంశాలు పూర్తయిన తర్వాతే ఈ బిల్లుకు మోక్షం లభించే అవకాశం ఉంది. దీంతో, ఈ బిల్లు కేవలం ఎన్నికల స్టంట్ అని, మహిళలపై మోడీ ప్రభుత్వానికి గౌరవం లేదని కాంగ్రెస్ సహా, ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ బిల్లుపై కాంగ్రెస్ నేత డాక్టర్ జయ ఠాకూర్ సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

ఈ చట్టం అమలుకు ఉన్న అడ్డంకులను తొలగించాలని, తక్షణమే ఈ చట్టాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో, ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఇక, మహిళా రిజర్వేషన్ బిల్లు బిజెపి గారడి అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గతంలో విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు రాజీవ్ గాంధీ 33% రిజర్వేషన్ కల్పించారని, అదే స్ఫూర్తితో పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు నెగ్గేందుకు తాము ఒత్తిడి చేశామని సోనియాగాంధీ అన్నారు. ఇక, ఈ బిల్లు ప్రతిపాదన యుపిఐ ఆన్లైన్ జరిగిందని సోనియాగాంధీ చెప్పారు మహిళా రిజర్వేషన్లు బిల్లు క్రెడిట్ కాంగ్రెస్ పార్టీదేనని ఆమె అన్నారు.

Tags:    

Similar News