యార్లగడ్డ ఏ వన్ ... గన్నవరంలో రచ్చ రచ్చేనా...?

వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వెంకటరావు కి గన్నవరం ఇంచార్జిగా ఈ మధ్యనే నారా లోకేష్ ప్రకటించారు.

Update: 2023-08-25 14:30 GMT

నిన్నటిదాకా వైసీపీలో ఉన్న యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరారు. గన్నవరంలో నారా లోకేష్ సభ మొత్తం ఆయన జాగ్రత్తగా దగ్గరుండి మరీ నిర్వహించారు. జనాలు పోటెత్తారు. ఈ సభలో చేసిన హాట్ కామెంట్స్ మీద మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తదితరుల మీద మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరో వైపు చూస్తే గన్నవరంలో వన్ సైడెడ్ గా నిన్నటిదాకా ఉన్న రాజకీయ కాస్తా యార్లగడ్డ ఆ వైపునకు వెళ్ళడంతో ఢీ అంటే ఢీ అంటోంది. దాంతో గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం రంగన్నగూడెంలో నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఘర్షణ జరిగింది. టీడీపీ వైసెపీ కార్యకర్తల మధ్యన జరిగిన ఈ పోరులో ఇరు వర్గాలు ఒక దశలో దాడులకు పాల్పడే దాకా వెళ్లారు.

దీంతో ఈ ఘర్షణకు సంబంధించి పోలీసులు టీడీపీ నేతల మీద కేసులు నమోదు చేశారు. అందులో కీలకమైన సెక్షన్లను కూడా పెట్టారు. హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు సుమారు యాభై మంది మీద కేసులు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏ వన్ గా పేర్కొంటూ యార్లగడ్డ వెంకటరావు మీద కేసు ఫైల్ అయింది.

వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వెంకటరావు కి గన్నవరం ఇంచార్జిగా ఈ మధ్యనే నారా లోకేష్ ప్రకటించారు. ఇపుడు ఆయన ఏకంగా ఏ వన్ నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిజానికి గన్నవరం టీడీపీకి కంచుకోట లాంటిది.

జగన్ ప్రభంజనం 2019 ఎన్నికలలో బలంగా సాగిన నేపధ్యంలో సైతం గన్నవరంలో పసుపు జెండా ఎగిరింది. అదే టీడీపీ నుంచి వల్లభనేని వంశీ వైసీపీలోకి వచ్చేశాక అంతా స్తబ్దుగా మారింది. ఇపుడు యార్లగడ్డ టీడీపీ గన్నవరం పగ్గాలు చేపట్టడంతో రాజకీయ కధ మొత్తం మారింది. మరో వైపు యార్లగడ్డతో పాటు ఆయన అనుచరులు కూడా పార్టీలో చేరడంతో టీడీపీలో మళ్లీ ఉత్సాహం కనిపిస్తోంది.

యార్లగడ్డ ఇన్నాళ్ళూ మౌనంగా వైసీపీలో ఉంటూ వచ్చారు. ఇపుడు టీడీపీలో చేరడం ద్వారా తన సత్తా చాటాలని చూస్తున్నారు. దాంతో గన్నవరం ఇక రోజూ రచ్చగానే మారుతుంది అని అంటున్నారు. అటు వల్లభనేని వంశీ ఇటు యార్లగడ్డలతో ఈ సీటు ఎన్నికలకు తొమ్మిది నెలల ముందు నుంచే వేడెక్కిపోతోంది అని అంటున్నారు.

రానున్న రోజులలో మరింతగా రాజకీయ రచ్చ సాగినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. మొత్తానికి యార్లగడ్డ ఇన్నాళ్ళూ వైసీపీలో అసంతృప్త నేతగా మాత్రమే ఉన్నారు. ఇపుడు టీడీపీలోకి రాగానే ఇంచార్జి పదవి దక్కింది. మరో వైపు ఏ వన్ గానూ కేసు పడింది. ఒక విధంగా యుద్ధానికి సిద్ధమంటూ యార్లగడ్డ చెప్పేశారు అని అంటున్నారు. దీని మీద వల్లభనేని వంశీ వర్గీయులు కూడా తగ్గేదేలే అంటున్నారు.

Tags:    

Similar News