వైసీపీలో సభ్యత్వాల గోల ఉండదా...?
పార్టీలో సాధారణ సభ్యత్వం క్రియాశీల సభ్యత్వం అని ఉంటాయి. దానికి ఒక రుసుమును పెట్టి చేర్పిస్తూ ఉంటారు.
రాజకీయ పార్టీ అన్నాక సభ్యత్వాలు అన్నవి ఉండాల్సిందే. ఆ మాటకు వస్తే సినీ నటుల అభిమాన సంఘాలకూ సభ్యత్వాలు ఉంటాయి. కట్టుదిట్టంగా నడిచే ఏ అసోసియేషన్ కి అయినా సభ్యత్వాలు అన్నవి చాలా కీలకంగా ఉంటాయి. మరి 2011 మార్చిలో పుట్టిన వైసీపీలో సభ్యత్వాలు అన్నవి అయితే ఇటీవల కాలంలో ఎక్కడా వినిపించని ముచ్చటగానే ఉంది.
పార్టీలో సాధారణ సభ్యత్వం క్రియాశీల సభ్యత్వం అని ఉంటాయి. దానికి ఒక రుసుమును పెట్టి చేర్పిస్తూ ఉంటారు. గ్రామ స్థాయిలో బూత్ లెవెల్ నుంచి సభ్యత్వాలను నమోదు చేస్తూ ఉంటారు. పాత వారి సభ్యత్వాలను కొత్తగా రెన్యూల్ చేయడమే కాకుడా కొత్త వారిని పార్టీలో చేర్చుకుని సంస్థాగతంగా బలోపేతం చేస్తారు.
టీడీపీ విషయానికి వస్తే ప్రతీ రెండు మూడేళ్ళకూ సభ్యత్వ నమోదు క్రమ పద్ధతిలో చేపడుతుంది. అంతే కాదు ఎప్పటికపుడు పాత రికార్డులు అధిగమిస్తూ కొత్తగా సభ్యత్వాలను చేయిస్తూ అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. టీడీపీ ఎన్నికల్లో పరాజయం పాలు అయినా జీవం కోల్పోకుండా పటిష్టంగా ఉండడానికి కారణం పార్టీ క్యాడర్ సభ్యత్వాలే అని గట్టిగా చెప్పాలి.
ఈసారి టీడీపీ సభ్యత్వం 94 లక్షలకు పై దాటుతోంది అని అంటున్నారు. కోటి సభ్యత్వాలు చేర్పించాలన్నది టీడీపీ టార్గెట్ గా ఉంది. అంటే ఏపీలో ఓటు హక్కు ఉన్న ప్రతీ నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యుడు అని ఆ పార్టీ గర్వంగా చెప్పుకుంటోంది. టీడీపీ ఒక్కటే కాదు జనసేన కూడా ఈసారి సభ్యత్వ నమోదు చాలా జోరుగా చేసింది. గామ వార్డు స్థాయిల నుంచి పెద్ద ఎత్తున ఔత్సాహీకులను ఆ పార్టీలో చేర్పించారు. ఎక్కువగా యువత జనసేనలో చేరారు.
బీజేపీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఏపీలో చేపట్టింది అయిదు లక్షలకు తక్కువ కాకుండా సభ్యులను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇలా కూటమిలోని అన్ని పార్టీలు సభ్య్త్వాలు నమోదు చేయిస్తూ కొత్త పుంతలు తొక్కుతూ ఉంటే వైసీపీలో మాత్రం ఆ ముచ్చటే లేదని అంటున్నారు.
వైసీపీ అయిదేళ్ళ పాలనలో పార్టీని సంస్థాగతంగా మరింతగా గట్టి పరచుకోవాల్సింది పోయి అసలు పట్టించుకోవడమే మానేశారని అలా కాడె వదిలేశారని కూడా అంతా అంటూ వచ్చారు. ఇపుడు అధికారం అయితే పోయింది. దాంతో పాటుగా పార్టీ ఎక్కడ దెబ్బ తిన్నది అన్న దాని మీద కచ్చితమైన విశ్లేషణ చేసుకుంటున్నారు. క్యాడర్ ని కాపాడుకోవాలని చూస్తున్నారు. జనవరి నెలాఖరు నుంచి జగన్ జిల్లా టూర్లు కూడా క్యాడర్ కోసం చేపడుతున్నట్లుగా చెబుతున్నారు.
అలాగే నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమిస్తున్నారు. అదే విధంగా మండల గ్రామ స్థాయి కమిటీలను వేయబోతున్నారు. మరి ఇన్ని చేయాలనుకున్నపుడు సభ్యత్వ నమోదు అన్నది కూడా పనిలో పనిగా చేపడితే పార్టీ మరింతగా బలోపేతం అవుతుంది కదా అని అంటున్నారు. అంతే కాదు కొత్త నీరు వస్తుందని పార్టీలో పనిచేసే వారు సమర్ధులు విధేయులు యువత కూడా ఎక్కువగా వస్తారు అని అంటున్నారు.
ఆ విధంగా చేయడానికి వైసీపీ అధినాయకత్వం ఇప్పటికైనా సిద్ధపడాల్సి ఉందని అంటున్నారు. ఏ పార్టీకైనా సభ్యత్వాలే జవం జీవం అన్న సంగాతి వైసీపీ పెద్దలకు తెలియనిది కాదని అంటున్నారు. మరి ఆ దిశగా వైసీపీ ఏమైనా కార్యచరణ కొత్త ఏడాదిలో తీసుకుంటుందా అన్నది చూడాల్సి ఉంది.