19న తేలిపోతుందా... వైసీపీలో టెన్షన్ ?
ఈ నెల 19 నాటికి కనుక అనుకున్న స్థాయిలో నంబర్ కనిపించకపోతే అతి పెద్ద సంక్షొభానికి వైసీపీ అడుగులు వేస్తున్నట్లు అవుతుందని కూడా కంగారు పడుతున్నారు.
ఈ నెల 19న వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొనాలని వైసీపీ తరఫున మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్ధులకు వర్తమానాలు అందాయి. అదే విధంగా పార్టీలోని కీలక నేతలకు కూడా సమాచారం వెళ్ళింది. ఈ సమావేశంలో జగన్ పార్టీ ఓటమికి గల కారణాలను సమీక్షిస్తారు. అంతే కాదు రానున్న కాలంలో ఎలా వ్యవహరించాలి అన్న దాని మీద దిశా నిర్దేశం చేస్తారు.
ఇదిలా ఉంటే ఈ నెల 19న జరిగే సమావేశానికి ఎంత మంది వస్తారు అన్న దాని మీదనే ఇపుడు వైసీపీ పెద్దల ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ఈ నెల 19 నాటికి కనుక అనుకున్న స్థాయిలో నంబర్ కనిపించకపోతే అతి పెద్ద సంక్షొభానికి వైసీపీ అడుగులు వేస్తున్నట్లు అవుతుందని కూడా కంగారు పడుతున్నారు. మరో వైపు నుంచి చూస్తే పార్టీలో ఎన్నికల ఫలితాల తరువాత భయంకరమైన స్తబ్దత ఆవహించింది.
దాదాపుగా నూటికి తొంబై శాతానికి పైగా నాయకులు గప్ చుప్ అయిపోయారు. వారు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారా లేక వైసీపీలో కొనసాగడం పట్ల ఏమైనా కొత్త ఆలోచనలు చేస్తున్నారా అన్నది వెల్లడి కావడం లేదు. అదే విధంగా గెలిచిన ఎమ్మెల్యేలు ఎంత మంది పార్టీ వెంట నడుస్తారు అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది.
ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు పార్టీ గెలుపుతో అంతా ఉంటారు కానీ ఓటమి ఎదురైతే ఉండరు అన్నది కూడా అంతా చూస్తున్నదే. అతి పెద్ద పార్టీగా పటిష్టంగా కనిపించిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ ఓటమి చెందగానే వరసబెట్టి వలసలు మొదలయ్యాయి. ఇపుడు ఆ పార్టీ ఉనికి పోరాటం చేస్తోంది. వైసీపీతో పోల్చితే పాతికేళ్ళ వయసు ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉంది. తెలంగాణా కోసం ఎంతో పోరాటం చేసిన పార్టీగా ఉంది.
కేసీఆర్ తరువాత కేటీఆర్ హరీష్ రావు వంటి దిట్టమైన నేతలు ఉన్న పార్టీ గ్రౌండ్ లెవెల్ వరకూ పూర్తిగా విస్తరించిన పార్టీ. పదేళ్ల పాటు అధికారాన్ని చలాయించిన పార్టీ. మరి అలాంటి పార్టీయే కోలాప్స్ అవుతున్న సంకేతాలు కనిపిస్తూంటే జగన్ తప్ప రెండ వారూ పేరూ వినిపించని కేవలం అయిదేళ్ల పాటు మాత్రమే అధికారంలో ఉన్న వైసీపీకి తగిలిన భారీ ఓటమి నుంచి ఎలా తేరుకుంటుంది అన్న చర్చ అయితే సాగుతోంది.
వైసీపీ వెంట నేతలు అంతా కొనసాగుతారా అన్న డౌట్లు అయితే అందరికీ ఉన్నాయి. ఎందుకంటే పార్టీ వెంట ఉండాలని ఉన్నా వ్యాపారాలు ఒత్తిళ్లు ఇలా చాలా ఈక్వేషన్స్ పనిచేస్తాయి. పోరాటం అంత ఈజీ అయితే కాదు. మరి ఈ నేపధ్యం నుంచి చూసినపుడు ఈ నెల 19న జరిగే వైసీపీ విస్తృత స్థాయి సమావేశం మీద అందరి కళ్లూ ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన రెండు వారాల వ్యవధిలో జరుగుతున్న ఈ సమావేశానికి జనాలు బాగా హాజరైతే మాత్రం వైసీపీకి కొంత ఇబ్బంది లేని వాతావారణం ఉంటుంది అని అంటున్నారు. అలా కాకుండా నంబర్ తగ్గితే మాత్రం వైసీపీ కి అగ్ని పరీక్ష అనే అంటున్నారు.
ఇక ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పార్టీకి రాజీనామా చేసి బోణీ కొట్టారు. మరి ఆయన బాటలో ఎంతమంది వెళ్తారు అన్నది కూడా చర్చగా ఉంది. వైసీపీలో అయితే చాలా మంది నేతలు బిజినెస్ లో ఉండాలని నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. దాంతో వారంతా జనాల్లోకి వచ్చి పోరాటం చేయలేరు. ఈ పరిణామాల నేపధ్యంలో వైసీపీకి ఈ నెల 19 కలసివచ్చే డేట్ గా ఉంటుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.