నిన్న నల్లజెర్ల, నేడు మాచర్ల... మహిళలపై దాడులు దేనికి సంకేతం?

ఈ సందర్భంగా స్పందించిన వైసీపీ మహిళా కార్యకర్తలు.. ప్రచారం ముగించుకుని ఒక ఇంటివద్ద కూర్చుని ఉంటే దాడిచేశారని చెబుతున్నారు.

Update: 2024-05-08 13:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ రాజకీయాలు రూటు మారుతున్నాయి! నిన్న మొన్నటివరకూ విమర్శలు, ప్రతి విమర్శలతో సాగినా ఏపీ ఎన్నికల రాజకీయం.. ఇప్పుడు భౌతిక దాడులకు తెగబడేవరకూ వచ్చింది! పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న వేళ పలువురు ఇంగితం మరిచి, మహిళలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. ఇలా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటుడటంతో పలు విమర్శలు తెరపైకి వస్తున్నాయి!

అవును... ఓటమి భయమో.. లేక, తాజా పరిస్థితుల వాస్తవం తెలియడం వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషనో... కారణం ఏదైనా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ మహిళలపై జరుగుతున్న దాడులు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు ఏమాత్రం చోటు లేదనేది అంతా అంగీకరించే విషయమే.. మైకుల్లో చెప్పే మాట.. కానీ, వాస్తవంలోకి వచ్చే సరికి చేతలు మాత్రం పూర్తి భిన్నంగా ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో... బుధవారం మాచర్ల నియోజకవర్గం వెల్దుర్ది మండలంలో మరోసారి పసుపు అల్లరి మూకలు చెలరేగిపోయారు. మహిళలపై విచక్షణ మరిచి రక్తం కారేలా దాడులకు తెగబడ్డారు. ఈ సమయంలో... ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమతో పాటు పలువురు మహిళలపై రక్తం వచ్చేలా దాడికి తెగబడటం తీవ్ర విమర్శల పాలవుతుంది.

ఈ సందర్భంగా స్పందించిన వైసీపీ మహిళా కార్యకర్తలు.. ప్రచారం ముగించుకుని ఒక ఇంటివద్ద కూర్చుని ఉంటే దాడిచేశారని చెబుతున్నారు. ఈ సందర్భంగా మహిళలమని కూడా చూడకుండా ఇలా తమపై దాడులకు తెగబడటం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ముఠాకు ఏమైనా న్యాయంగా ఉందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో రేపు టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలను ధైర్యంగా బయట తిరగనిస్తారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు!

కాగా... మంగళవారం రాత్రి గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని నల్లజెర్లలో ప్రచారం ముగించుకుని స్దానికంగా ఉన్న మాజీ జెడ్పీటీసీ ఇంటికి వెళ్లిన హోంమంత్రి తానేటి వనితపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించి భీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమెను సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఒక గదిలో ఉంచి భద్రత కలిగించారు కాబట్టి సరిపోయింది కానీ.. లేకపోతే ఎలాంటి పరిణామాలు జరిగేవనేది తలచుకుని హడలిపోతున్నారు ప్రజానికం!

ఆమె లోపల ఉండగా.. బయట ఆ అల్లరి మూకలు ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ.. తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇది సరైన విధానం కాదని ప్రజాస్వామ్య వాదులంతా అభిప్రాయపడ్డారు. ఇలాంటివాటిని ఆ పార్టీ అధినేత ప్రోత్సహించకూడదని.. అలాకానిపక్షంలో తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఇదే సమయంలో విజయవాడలో బోండా ఉమ అనుచరులు వైసీపీ మహిళా కార్యకర్తలపై దాడి చేసిన సంగతీ తెలిసిందే. అంతకుముందు మంత్రి బాలినేని కోడలుపై ఒంగోలులో దాడి చేసిన పరిస్థితి! ఇలా పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ టీడీపీ కార్యకర్తలు వైసీపీ మహిళా కార్యకర్తలు, నేతలే లక్ష్యంగా దాడులకు తెగబడుతుండటం తీవ్ర విమర్శల పాలవుతుంది. ఈ సందర్భంగా మహిళా లోకం అంతా ఏకమై ఈ దాడులు ప్రోత్సహిస్తున్న వారికి బుద్దిచెప్పాలనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఇదే క్రమంలో... మైకుల ముందు మాత్రం కూటమి అధికారంలోకి రాబోతుందని చెబుతూ.., వెనుక మాత్రం ఇలాంటి పనులు చేయడంతో ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా... కూటమి గెలవబోతుందని చెప్పే వన్నీ మేకపోతు గాంభీర్యపు మాటలు మాత్రమే అని, అసలు వాస్తవం వారికి కూడా తెలుసని, ఈ క్రమంలోనే ఓటమి భయంతో చంద్రబాబు & కో ఇలాంటి పనులకు పాల్పడుతున్నారనే చర్చ ప్రజల్లో బలంగా జరుగుతుందని తెలుస్తుంది!

Tags:    

Similar News