షర్మిల కంట్రోల్ అయ్యారా... కంట్రోల్ చేశారా...?
తన అన్నకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. ఇది ఎన్నికల తర్వాత కూడా సాగింది. అయితే.. కొన్ని రోజులుగా షర్మిల వాయిస్ తగ్గిపోయింది.
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల కాలంలో కంట్రోల్ అయినట్టు తెలుస్తోంది. ఆమె దూకుడు, వ్యూహాలు అన్నీ కూడా తగ్గిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎన్నికలకు ముందు తన సొంత అన్న జగన్‌పై రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా.. కన్నీరు పెట్టుకుని, చెంగు చాపి మరీ ఓట్లు అభ్యర్థించారు. తన అన్నకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారు. ఇది ఎన్నికల తర్వాత కూడా సాగింది. అయితే.. కొన్ని రోజులుగా షర్మిల వాయిస్ తగ్గిపోయింది.
ముఖ్యంగా రెండు మూడు సార్లు జగన్.. బెంగళూరు పర్యటనలు చేయడం.. అక్కడి కాంగ్రెస్ కీలక నాయకులతో ఆయన రహస్య సమావేశాలు నిర్వహించిన దరిమిలా.. ఏపీలో మార్పులు రావడం ప్రారంభమైంది. అప్పటి వరకు విషయం ఏదైనా.. అన్న పాలనతో ముడిపెట్టి విమర్శలు గుప్పించిన షర్మిల.. తర్వాత కాలంలో తన దూకుడును తగ్గించారు. నిజానికి అప్పటికి సంబంధం లేకున్నా.. గోదావరికి వరద వచ్చి రైతుల పొలాలు మునిగిపోయిన సమయంలో కూడా.. జగన్ పాలన సరిగా ఉండి ఉంటే.. ఎర్రకాలువకు గండి పడేది కాదని దుయ్యబట్టారు.
ఖచ్చితంగా అదేసమయంలో జగన్ డిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఇటు వైపు షర్మిల వ్యూహాత్మకంగా గోదావరి జిల్లాల్లో పర్యటించి.. వరద నీటిలో మునిగి మరీ.. అన్న చుట్టూ రాజకీయాలు చేశారు. ఆ తర్వాత.. మాత్రం వాయిస్‌లో మార్పు కనిపించింది. ఎక్కడ ఏంజరిగినా.. దానికి పెద్దగా కలరింగ్ ఇవ్వకుండా.. సౌమ్యంగా స్పందిస్తున్నారు. గుడ్లవల్లేరు ఘటన విషయంపై స్పందించిన షర్మిల ఎక్కడా తన అన్న పాలనను ప్రస్తావించలేదు. అలాగే.. ఇతర విషయాలపై కూడా.. ట్వీట్లు చేస్తున్నా.. జగన్ పాలనలో ఇలా జరిగింది.. అంటూ ప్రస్తావించడం లేదు.
ఈ పరిణామాలను గమనిస్తే.. ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇలా షర్మిలను కంట్రోల్ చేశారా? లేక.. ఆమే పార్టీ కోసం ఎంత చేసినా.. తనకు ఆధిపత్యం ఇవ్వడం లేదన్న కారణంగా తనంతట తానే కంట్రోల్ అయ్యారా? అనేది ఆసక్తిగా మారింది. నిజానికి కాంగ్రెస్‌లో ఏ నాయకుడు అయినా.. అధిష్టానం చెప్పినట్టే వినాలి. కానీ, ఇక్కడ మాత్రం షర్మిల చాలా వ్యూహాత్మకంగా తన అజెండా అమలు చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు బ్రేకులు వేసినట్టు తెలుస్తోంది. అందుకే.. ఇలా తన సొంత అజెండాను పక్కన పెట్టి వ్యవహరిస్తున్నారన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో సాగుతుండడం గమనార్హం.