విన‌లేదు.. చెప్పారంతే: వైసీపీ టాక్‌

ఎన్ని ముడులు వేసినా `భైర‌వ వాలం` వంక‌ర‌గానే ఉంటుంద‌ని సామెత‌.

Update: 2024-10-12 10:30 GMT

ఎన్ని ముడులు వేసినా `భైర‌వ వాలం` వంక‌ర‌గానే ఉంటుంద‌ని సామెత‌. అచ్చం అలానే ఉంద‌ట‌.. వైసీపీ అధినేత ప‌రిస్థితి. ఈ మాట ఎవ‌రో కాదు.. కీల‌క నాయ‌కులే చెబుతున్నారు. కొంద‌రు బాహాటంగానే బ‌య‌ట ప‌డుతుంటే.. మ‌రికొంద‌రు గుస‌గుస‌గా దెప్పిపొడుస్తున్నారు. స‌హ‌జంగా ఎదురు దెబ్బ‌లు త‌గిలిన‌ప్పుడు ఎంత‌టి వారైనా ఒక్క అడుగు వెన‌క్కి తీసుకుంటారు. ఆలోచించుకుని అడుగులు వేస్తారు. అయితే.. దీనికి భిన్నంగా వైసీపీ అధినేత ప‌రిస్థితి ఉంద‌ని చెబుతున్నారు.

తాజా ఎన్నిక‌ల్లో వైసీపీ 11 స్థానాల‌కు ప‌రిమితమైంది. ఇదేమీ మామూలు ప‌రాజ‌యం కాదు. చాలా పెద్ద ఎదురు దెబ్బ‌. దీంతో అస‌లు ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని క్షేత్ర‌స్థాయి నుంచి నివేదిక‌లు తెప్పించుకుని వాటిని స‌రిదిద్దుకుని వ‌డివ‌డిగా అడుగులు ముందుకు వేస్తారు. కానీ, వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ మాత్రం ఆదిశ‌గా అడుగులు వేయ‌డం లేదని సొంత నాయ‌కులే చెబుతున్నారు. తాజాగా గ‌త రెండు రోజుల నుంచి ఆయ‌న పార్టీ నేత‌లతో భేటీ అయ్యారు.

ఇదిమంచి ప‌రిణామం. అస‌లు ఏం జ‌రిగిందో అధినేత‌కు చెప్పుకొనేందుకు నాయ‌కుల‌కు పెద్ద అవ‌కాశ‌మే చిక్కింది. మంగ‌ళ‌గిరి, తెనాలి నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన నాయ‌కుల‌తో జ‌గ‌న్ భేటీఅయ్యారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు త‌మ గోడును విన్న‌వించుకుందామ‌ని భావించారు. ఒక‌రిద్ద‌రైతే.. ప‌దుల పేజీల్లో నివేదిక‌లు కూడా రెడీ చేసుకుని వెళ్లారు. ఇంకొంద‌రు అస‌లు ఏం జ‌రిగిందో చూపించాల‌ని త‌మ త‌మ ఫోన్ల‌లో వీడియోల‌ను కూడా రెడీ చేసుకున్నారు.

కానీ, చిత్రం ఏంటంటే.. జ‌గ‌న్ ఎవ‌రు మాటీ విన‌లేదు. తాను చెప్పాల‌నుకున్న‌ది చెప్పేశారు. అంతే! క‌థ అక్క‌డితో ముగిసిపోయింది. పోనీ.. ఈ చెప్పాల‌నుకున్న విష‌యంలోనే స‌బ్జెక్ట్ ఏమైనా ఉందా? అంటే అది కూడా లేదనేది నాయ‌కుల మాట‌. కేవ‌లం కూట‌మి స‌ర్కారుపై విమ‌ర్శ‌లు చేసేందుకు, త‌న పాల‌న‌లో జ‌రిగిన మంచిని చెప్పుకొనేందుకు మాత్ర‌మే జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చార‌న్న‌దివారి ఆవేద‌న‌. జ‌గ‌న్ పాల‌న‌లో ఏం జ‌రిగింద‌నేది ప్ర‌జ‌ల‌కు తెలుసున‌ని.. కానీ, ఇప్పుడు భ‌విష్య‌త్తులో ఎలాంటి అడుగుల వేయాల‌న్న‌దే ముఖ్య‌మ‌ని, ఆ దిశగా ఏమాత్రం దిశానిర్దేశం చేయ‌లేద‌న్న‌ది నాయ‌కులు చెబుతున్న మాట‌.

Tags:    

Similar News