టీడీపీతో కలసి వైసీపీ పోరాటం...షాకింగేనా ?

ఏపీలో చూస్తే తెలుగుదేశం పార్టీ వైసీపీల మధ్యన రాజకీయం ఉప్పు నిప్పుగా ఉంటుంది అన్నది తెలిసిందే.

Update: 2025-02-05 00:30 GMT

ఏపీలో చూస్తే తెలుగుదేశం పార్టీ వైసీపీల మధ్యన రాజకీయం ఉప్పు నిప్పుగా ఉంటుంది అన్నది తెలిసిందే. ఈ రెండు పార్టీలూ ఎపుడూ ఏ రకమైన ఇష్యూ మీద కలసి మాట్లాడింది లేదు అన్నది అయిదు కోట్ల ఆంధ్రుల సాక్షిగా పదేళ్ళ విభజన ఏపీలో అందరికీ తెలిసిన సంగతే.

విభజన ఏపీకి ఇచ్చిన హామీల మీద బలమైన ఈ రెండు పార్టీలూ ఒకే త్రాటి మీదకు వచ్చి పోరాటం చేసి ఉంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరేవి. ప్రత్యేక హోదా సహా ఎన్నో ఏపీకి వచ్చేవి అన్న భావన అందరిలో ఉంది. అయితే కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇవ్వడంతో పోటీ పడుతూ వస్తున్నాయి ఏపీలోని పార్టీలు.

ఇదిలా ఉంటే పోలవరం ఇష్యూ మీద ఏపీలో వైసీపీ టీడీపీతో కలసి పోరాటానికి సై అంటోంది. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గించాలని కేంద్రం చూస్తోందని దీని వల్ల బహుళార్ధక సాధక ప్రాజెక్టు కాస్తా ఒక బ్యారేజ్ గా మారుతుందని ఏడున్నర లక్షల ఎకరాలకు అందాల్సిన పోలవరం నీరు మూడున్నర లక్షలకే సరిపోతుందని లోక్ సభలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

పోలవరం ఎత్తుని 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల ఏపీకి పూర్తి నష్టం వస్తుందని పోలవరం సామర్థ్యం కూడా 194 నుంచి 115 టీఎంసీలకు తగ్గిపోతుందని అన్నారు. ఇది ఏపీలోని రైతాంగానికి తీరని అన్యాయం చేసినట్లే అని మిధున్ రెడ్డి అన్నారు. 115 టీఎంసీలకు పోలవరాన్ని తగ్గించడాన్ని ఆంధ్రులు ఎవరూ క్షమించరు అని వైసీపీ ఎంపీ స్పష్టం చేశారు.

విభజన చట్టంలో ఏ విధంగా ఉందో అంతే స్థాయిలో పోలవరం నిర్మాణాన్ని కేంద్రం పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవన్నీ పక్కన పెడితే తెలుగుదేశం ఎంపీలతో కలసి ఈ విషయంలో పోరాడుతామని మిధున్ రెడ్డి ప్రకటించడం పట్ల చర్చ సాగుతోంది. కేంద్రంలో టీడీపీ అధికారం పంచుకుంటోంది.

ఇపుడు ఆ పార్టీ కేంద్రంతో నేరుగా ఎలా పోరాటం చేస్తుంది అన్నది ప్రశ్నగా ముందుకు వస్తోంది. అంతే కాదు తెలుగుదేశం బీజేపీ ఘట బంధం గట్టిగా ఉంది. అది మరిన్ని ఎన్నికలలో కూడా సాగుతుందని అంటున్నారు. ఈ క్రమంలో పోలవరం ఇష్యూని తీసుకుని టీడీపీని బీజేపీ నుంచి దూరం చేయడానికి వైసీపీ వేసిన ఎత్తుగడగా ఇది ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి.

అయితే ఈసారి మాత్రం కేంద్రంతో బీజేపీతో విభేదించి టీడీపీ బయటకు రావడానికి ఏ మాత్రం సిద్ధపడదని అంటున్నారు. అయితే 2014 నుంచి 2019 మధ్యన ప్రత్యేక హోదా ఇష్యూతో టీడీపీని ఏపీలో ఇరకాటంలో పెట్టిన చందంగా ఇపుడు పోలవరం ఎత్తు తగ్గింపు అన్న సెంటిమెంట్ ఇష్యూని వైసీపీ వ్యూహాత్మకంగా తీసుకుని ముందుకు సాగుతుందా అన్నది కూడా చర్చగా ఉంది.

అయితే పోలవరం ప్రాజెక్టుని రెండు దశలుగా నిర్మించడం అన్నది వైసీపీయే మొదలెట్టింది అని టీడీపీ అంటోంది. పోలవరం ప్రాజెక్టుని తాము పరిపూర్తి చేస్తామని అంటోంది. ఈ విషయంలో ఎటువంటి సందేహాలు ఉండవద్దని చెబుతోంది. 2019 కి ముందు ఎప్పుడూ లేని పేజ్ వన్, పేజ్ టూ లను పోలవరంలో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని అంటోంది . పోలవరం ప్రాజెక్ట్ చరిత్రలో 41.15 మీటర్లు 45.72 మీటర్లు అంటూ రెండు పేజ్ లను కేంద్రానికి వైసీపీ వారే పంపారని అంటోంది.

ఇదిలా ఉంటే 990 కోట్ల రూపాయలతో తిరిగి డయాఫ్రం వాల్ నిర్మాణం ప్రారంభించి 2025 డిసెంబర్ కల్లా పూర్తి చేస్తామని 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టు ను పూర్తి చేస్తామని చెబుతోంది.. ఇలా వైసీపీ టీడీపీల మధ్య పోలవరం ఇష్యూ పొలిటికల్ గా మారుతున్న వేళ ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది. వైసీపీ సోలోగా పోలవరం ఫైట్ స్టార్ట్ చేస్తుందా అన్నది కూడా చర్చకు వస్తోంది.

Tags:    

Similar News