షర్మిల కొత్త రాజకీయ ప్రస్థానం... డేట్ ఫిక్సయ్యిందంట!
గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో షర్మిళ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే
గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో షర్మిళ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే! మొదట్లో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అని పెట్టి పాదయాత్ర కూడా చేసిన షర్మిళ... అధికార బీఆరెస్స్ పై ఆమె శక్తిమేరకు పోరాడారనే చెప్పాలి. ఆమె రాజకీయం అలా సాగుతున్న సమయంలో... కాంగ్రెస్ తో పొత్తు / విలీనం అనే మాటలు తెరపైకి వచ్చాయి.
కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం డీకే శివకుమార్ ఆ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. అనంతరం ఒకరోజు ఉన్నపలంగా షర్మిళ.. ఆయనతో భేటీ అయిన ఫోటోలు బయటకు వచ్చాయి. అనంతరం... కాంగ్రెస్ నేతలపై ఆమె ట్విట్టర్ లో అభిమానం చూపించడం మొదలుపెట్టారు.
దీంతో... విలీనం కన్ ఫాం అనే చర్చ మరింత బలపైంది. అయితే షర్మిళ మాత్రం పొత్తు కోసం ప్రయ్తనిస్తున్నారనే కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విలీనానికే ఆమె అంగీకరించారని.. ఇందుకు సంబంధించిన తేదీ కూడా ఫిక్సయ్యిందని అంటున్నారు.
అవును... వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ పై ఊహాగానాలకు తెరపడే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. కాంగ్రెస్ లో వైఎస్సార్ టీపీ ని షర్మిల విలీనం చేస్తారనే ప్రచారం గత కొంత కాలంగా విస్తృతంగా సాగుతోన్న నేపథ్యంలో... అందుకు ముహూర్తం ఫిక్సయ్యిందని అంటున్నారు. కాంగ్రెస్ తో డీకే శివకుమార్ చర్చలు ఇప్పటికే కొలిక్కి వచ్చాయని సమాచారం.
ఇదే క్రమంలో ఇటీవల షర్మిల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో తన పార్టీ విలీనం, అలాగే జాతీయ పార్టీలో తన పాత్రపై చర్చించారని సమాచారం. దీనికోసం కేవీపీ రామచంద్ర రావు కూడా కీలకంగా వ్యవహరించారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. దీంతో మాటలు పూర్తయ్యాయి... ఇక కాంగ్రెస్ లో వైఎస్సార్‌టీపీ విలీనమే తరువాయని అంటున్నారు!
ఇందులో భాగంగా... ఈ నెల 22న షర్మిల కాంగ్రెస్ కండువాను కప్పుకోనున్నట్టు సమాచారం. ఇప్పటికే అన్ని రకాల చర్చలూ పూర్తయ్యాయని అంటున్నారు. ఈ నెల 22 వ తేదీ మంగళవారం నాడు షర్మిళ కాంగ్రెస్ నాయకురాలిగా కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ లో తన తండ్రి వారసత్వాన్ని ఏమేరకు కంటిన్యూ చేస్తారనేది వేచి చూడాలి.
కాగా... కాంగ్రెస్ నాయకుడిగా, గాంధీ కుటుంబానికి అత్యంత ఇష్టమైన వ్యక్తిగా వైఎస్సార్ పేరు పొందిన సంగతి తెలిసిందే. సోనియాగాంధీ ఆశీస్సులతో 2004లో వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వగా.. ఆ తర్వాత రెండోసారి 2009లో ఏపీలో కాంగ్రెస్ ను ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు.
ఇదే సమయంలో నాడు కేంద్రంలో యూపీఏ రెండోసారి అధికారంలోకి రావడానికి ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఎంపీ సీట్లు గెలవడానికి వైఎస్సార్ నాయకత్వమే కారణం. దీంతో... షర్మిలకు కాంగ్రెస్ వాతావరణం కొత్తేమీ కాదని, వీలైనంత త్వరగా సర్ధుకుపోతారని అంటున్నారు పరిశీలకులు.
ఆ సంగతి అలా ఉంటే... కాంగ్రెస్ లోకి షర్మిళ రాకను ఆ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు ఆహ్వానిస్తుండగా... పక్కపార్టీల నుంచి వచ్చిన కొందరు వ్యతిరేకిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది!