వైసీపీ విశాఖ ఎంపీగా పెద్దాయన...?
ప్రతిష్టాత్మకమైన విశాఖ ఎంపీ సీటులో ఎవరు పోటీ చేస్తారు అన్నదే ఇపుడు వైసీపీలో చర్చ సాగుతోంది.
వైసీపీకి విశాఖ ఎంపీ సీటు అన్నది ఇపుడు అత్యంత కీలకంగా మారబోతోంది. 2014 లో ఈ సీటు నుంచి పోటీ చేసిన వైఎస్ విజయమ్మ ఓటమి చవి చూశారు. అయితే 2019లో జగన్ వేవ్ తో పాటు అన్నీ కలసి వచ్చి వైసీపీ ఎంపీ సీటు నెగ్గింది. చిత్రమేంటి అంటే విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలలో నాలుగు టీడీపీ గెలుచుకున్నా కూడా ఎంపీ మాత్రం వైసీపీ పరం అవడం విశేషం.
అయితే 2024లో అలాంటి పరిస్థితులు ఉంటాయని ఎవరూ భావించడంలేదు. ఎందుకంటే విశాఖ సిటీలో టీడీపీ ఈ రోజుకీ బలంగానే ఉంది ఇక బీజేపీ జనసేనలతో పొత్తులు ఉంటే సీన్ వేరే విధంగా మారుతుంది అని అంటున్నారు. దాంతో వైసీపీ నుంచి ఎంపీ క్యాండిడేట్ ఎవరు అన్న మరో కొత్త చర్చ కూడా తెర మీదకు వస్తోంది.
విశాఖ ఎంపీ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ప్రకటించే అవకాశాలు తక్కువ అని అంటున్నారు. దానికి మొదటి కారణం గత ఎన్నికల్లో ఆయన కేవలం నాలుగు వేల స్వల్ప మెజారిటీతోనే గెలిచారు. ఇక ఆయన పదవీకాలంలో జనాలతో పెద్దగా కనెక్ట్ అయినదీ లేదు. మరో వైపు పార్టీతో అంతంతమాత్రం రిలేషన్స్ నే ఆయన మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చారు.
ఇక లేటెస్ట్ గా ఆయన ఫ్యామిలీ కిడ్నాప్ వ్యవహారం కూడా రాజకీయంగా రచ్చ రేపింది. దీంతో పాటు ఎంపీ ఎంవీవీ కూడా పోటీకి విముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈసారి ఆయన ఇస్తే అసెంబ్లీకి పోటీ చేయడం లేదా ఏకంగా పోటీకి దూరంగా ఉండడం అన్న ఆప్షన్లతో ఉన్నారని అంటున్నారు.
మరి ప్రతిష్టాత్మకమైన విశాఖ ఎంపీ సీటులో ఎవరు పోటీ చేస్తారు అన్నదే ఇపుడు వైసీపీలో చర్చ సాగుతోంది. అయితే వైవీ సుబ్బారెడ్డిని పోటీ చేయించే ఆలోచనలో పార్టీ ఉందని అంటున్నారు. ఆయన విశాఖ వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్నారు.
ఆగస్ట్ ఏడవ తేదీతో టీటీడీ చైర్మన్ గా ఆయన పదవీ కాలం పూర్తి అవుతుంది. ఆ మీదట ఆయనకు వేరే బాధ్యతలు ఉండవు. పూర్తి కాలం విశాఖలోనే ఉంటూ అటు పార్టీ వ్యవహారాలను చక్కబెడతారని అంటున్నారు. కేరాఫ్ అడ్రస్ ని కూడా విశాఖకే మార్చేస్తారు అని అంటున్నారు. దాంతో రానున్న రోజులలో ఎంపీ విశాఖ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మరింత విస్తృతంగా తిరుగుతూ ఎంపీ అభ్యర్ధిగా తన ప్రచారాన్ని మొదలెడతారు అని అంటున్నారు.
మరి వైవీ సుబ్బారెడ్డి ఎంపీగా పోటీ చేస్తే రాజకీయ సమీకరణలు ఎలా ఉంటాయి. వైసీపీ ఎంతవరకూ ఈ పొత్తుల ఎత్తులను దాటుకుని ముందుకు వెళ్తుంది అన్నది చర్చకు వస్తోంది. ఇక విశాఖలో అన్ని పార్టీలు నాన్ లోకల్స్ కే ఎంపీ టికెట్లు ఇస్తున్నందువల్ల నాన్ లోకల్ వైవీ అన్న ప్రశ్న అయితే ఉత్పన్నం కాదని అంటున్నారు. సో జగన్ సొంత బాబాయ్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తే మాత్రం అది పార్టీకి మరో ప్రతిష్టాత్మకమైన విషయంగానే చూడాల్సి ఉంటుంది అని అంటున్నారు.